Tuesday, January 25, 2011

మా రచ్చబండకు వైఎస్సే స్ఫూర్తి రూ. 2500 కోట్లతో 26 లక్షల కుటుంబాలకు లబ్ధి

నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం
రచ్చబండ సభావేదికపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించిన రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన స్ఫూర్తితోనే ప్రారంభించామని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆయన సోమవారం ఉదయం 11.45కు శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని డోలపేట జడ్పీ హైస్కూలు వద్ద రచ్చబండను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ 90% లక్ష్యాలు సాధించామన్నారు.

మిగిలిన 10% మందికీ పథకాలు అందాలనే లక్ష్యంతోనే రచ్చబండ నిర్వహిస్తున్నామన్నారు. తన తండ్రి అమర్‌నాధ్‌రెడ్డి 1978 నుంచి 82 వరకు ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఆ అనుబంధం తాను మరిచిపోలేనిదని.. అందుకే శ్రీకాకుళం జిల్లా నుంచే రచ్చబండ ప్రారంభించానని చెప్పారు. రాష్ట్రంలో 1.92 కోట్ల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయని, రచ్చబండ ద్వారా 5.70 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 82 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికి 51 లక్షలు పూర్తయ్యాయని, 14 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవిగాక రచ్చబండ ద్వారా 4.70 లక్షల ఇళ్లను మంజూరుచేస్తున్నామని చెప్పారు.

అభయహస్తంలో 43 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, మరో 14 లక్షల మంది సభ్యులుగా చేరనున్నారని తెలిపారు. రచ్చబండ ద్వారా రాష్ట్రంలోని 26 లక్షల కుటుంబాలకు రూ. 2500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రాజాం బస్టాండ్ వద్ద జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ 2004కు ముందు వైఎస్ఆర్‌తో కలిపి తాను, ధర్మాన, శతృచర్ల వంటి నేతలంతా ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషిచేసి అధికారంలోకి తేగలిగామని చెప్పారు. వైఎస్ స్ఫూర్తి మేరకే రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదన్నారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారధి, శతృచర్ల విజయరామరాజు, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, విజయనగరం, శ్రీకాకుళం ఎంపీలు బొత్స ఝాన్సీలక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీలు మజ్జి శారద, హరిబాబునాయుడు, శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులు, బొడ్డేపల్లి సత్యవతి, నిమ్మక సుగ్రీవులు, మీసాల నీలకంఠం, ధర్మాన కృష్ణదాస్, అధికారులు పాల్గొన్నారు.

పేదల కోసమే

"రచ్చబండను రాజకీయాల కోసం నిర్వహించడం లేదు. కండబలం లేని, నిస్సహాయులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని, వారింటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందించాలనే ప్రారంభించాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలకూ ఉంది'' అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుసినిలో ఏర్పాటుచేసిన రచ్చబండను ఆయన ప్రారంభించారు. ఈ గ్రామాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని, గ్రామంలో అమలైన పథకాల తీరు బాగా ఆకట్టుకుందని, ముఖ్యంగా గృహ లబ్ధిదారులు నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా ఉన్నారని కొనియాడారు.

రచ్చబండ అంటే ఇలా ఉండాలన్నట్టు చెట్టు.. దాని చుట్టూ రచ్చబండ ఏర్పాటు బాగున్నాయని కితాబునిచ్చారు. రచ్చబండ, సభలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు అధ్యక్షత వహించగా, ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, బొత్స సత్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, అప్పలనరసయ్య, రాజన్నదొర, జయమణిలతోపాటు ఎమ్మెల్సీలు శ్రీనివాసులు నాయుడు, వాసిరెడ్డి వరదారామారావు, జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్, డీసీసీ చైర్మన్ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.
Click Here!

రాజాంకు సీఎం వరాల జల్లు

రాజాం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలు సభావేదికగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన సీఎం వాటిని పరిష్కరించేందుకు అంగీకరించి వరాల జల్లు కురిపించారు. స్థానిక మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పార్థసారధి హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కూడా జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికి తాగునీరు అందేవిధంగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన రూ.39 కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తానని చెప్పారు. రాజాం సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రూ.10 కోట్లు మంజూరు కూడా చేశారు. తోటపల్లి ప్రాజెక్టు 120 రోజుల్లోనే పూర్తయి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన రూ. 40 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పదివేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఎంపీ ఝాన్సీ కోరిక మేరకు మంజూరు చే సేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సమస్యల జాబితాను పూర్తిస్థాయిలలో పరిశీలించి వీలైౖనంతమేరకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రూ.35 కోట్లుతో కలెక్టరేట్‌కు నూతన భవనం నిర్మించాలని కోరారని, అతను తన సొంత జిల్లా చిత్తూరుకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరించి కలెక్టరేట్ భవనం నిర్మాణానికి కృషి చేశారని చెప్పారు.

ఆయన కోరిక మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నూతన భవనానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే లైను, ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టినందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంద ని, అందరికి కృతజ్ఞతలని, ఈ ఉత్సాహంతో పనిచేస్తూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నారు.
Click Here!
 వైఎస్‌కు మేమే వారసులం: విశాఖలో సీఎం
* వైఎస్ కుమారుడిపై ఖూనీ కేసు విషయంలో అసెంబ్లీలో టీడీపీకి సమాధానం చెప్పేందుకు 60 రోజులు చదివా..
*
ఎలా డిఫెండ్ చేస్తున్నావని వైఎస్ ఒక్క రోజు కూడా అడగలేదు.. నాపై ఆయనకు అంత నమ్మకం
*
వైఎస్ హెలికాప్టర్‌లో నేనూ వెళ్లాల్సి ఉంది.. ఆఖరి క్షణంలో నేను అందులో వెళ్లలేదు
*
ఢిల్లీతో నాకు సంబంధాలు లేవు.. నుదిటిపై రాసుంటేనే పదవులు
హత్యకేసునుంచి జగన్‌ను గట్టెక్కించా
rachaa
 ఓ హత్య కేసులో దివంగత వైఎస్సార్‌ తనయుడ్ని తాను గట్టెక్కించినట్టు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి ప్రకటించి, సంచలనం సృష్టించారు. అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీకి జవాబిచ్చేందుకు 60 రోజులు ప్రిపేరై ఎదురుదాడి చేసినట్టు ఆయన వివరించారు. హత్యకు సంబంధించిన సిబిఐ కేసుపై ఏ విధంగా ఆర్గనైజ్‌ చేస్తావంటూ, ఎలా డిఫెన్స్‌ చేస్తావనిగాని ఏ ఒక్కరోజూ కూడా వైఎస్సార్‌ అడగలేదని ఆయన గుర్తు చేశారు. అదేమంటే ప్రధాని తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వ లేదని జగన్‌ పదే పదే అంటూ దాన్నొక వివాదం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా వైఎస్‌కు, తనకు కూడా ప్రధాని అప్పాయింట్‌ మెంట్లు దొరకని సందర్భాలున్నాయని కిరణ్‌ అన్నారు.

సోమవారం సాయంత్రం అమ్‌కోసా హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమా వేశంలో సిఎం మాట్లాడారు. ఐదేళ్ళు చీఫ్‌ విప్‌గా వున్న సమయంలో వైఎస్సార్‌పై ఈగ వాలి తే మాటల యుద్ధం చేశానన్నారు. దీంతో తాను శత్రుత్వం తెచ్చుకున్నానన్నారు. వైఎస్సార్‌ లాంటి నాయకుడ్ని, ఆయన కుటుంబంపై నమ్మకం పోగొడితే కాంగ్రెస్‌ పార్టీ బలహీ నపడుతుందని, తద్వారా దెబ్బతీయవచ్చన్న ప్రతిపక్షాల కుట్రను అసెంబ్లీలో బహిరంగంగా ఎదుర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. రాజశేఖర్‌రెడ్డితో కలిసి 20 ఏళ్ళు పార్టీ అభివృద్ధికి అహోరాత్రులు కష్టపడిన తాము రాజకీయ వారసులమా? ఆయన కుటుంబమా? అని ప్రశ్నించారు.


1978 నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్‌ను ఇంత పెద్ద నాయ కుడ్ని చేసింది కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబమేనని వివరించారు. అధిష్టానం మద్దతుతోనే వైఎస్సార్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్న విషయాన్ని మరిచిపోకూ డదన్నారు. వేదికపై ఎమ్మెల్యేలుగా కూర్చొన్న అడ్రస్‌ పార్టీ ఇచ్చిందని, అటువంటి పార్టీని మరిచిపోతే అడ్రస్‌ లేకుండా పోతామన్నారు. ఇందిరాగాంధీ మృతి చెందాక కాంగ్రెస్‌ పని అ యిపోయిందన్నారని, అదే విధంగా రాజీవ్‌గాంధీ మృతి చెందాక అన్నారని, వైఎస్సార్‌ మృతి చెందాక కూడా కాంగ్రెస్‌ పని అయిపోయిందంటున్నారని, ఇది శోచనీయమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ బూత్‌లో చూసినా 30 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేసే వాళ్ళు వున్నార న్నారు. పార్టీపై వున్న అభిమానంతో ప్రజలు, కార్యకర్తలు ఓట్లు వేయడం వల్లే, కాంగ్రెస్‌ ఇం త బలంగా వుందన్నారు. పార్టీ దయతలచి తమకు టిక్కెట్‌ ఇస్తే ఎమ్మెల్యేలయ్యామని, మీరు కార్యకర్తలయ్యారన్నారు. నాయకుల వల్ల పార్టీ బతకడం లేదని, కార్యకర్తల వల్లే బతుకుతోం దని ఆయన వివరించారు. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదని, నాయకులు లేకపోతే, మరో వందమంది కార్యకర్తలు నాయకులవుతారన్నారు. కొన్ని రోజులు పార్టీలో ఒడిదుడుకలుం టాయని, స్పీడ్‌ బ్రేకర్ల మాదిరిగా వస్తుంటాయని వాటిని త్వరలోనే దాటుతామని ఆయన అన్నారు.

 
 రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందనడం అపోహేనని, అలా ప్రచారం చేసి లాభపడాలని కొందరు చూస్తున్నారని.. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసులం తామేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకున్నారు. ‘‘వైఎస్ చనిపోయాక రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులేర్పడ్డాయి. వరదలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అనిశ్చితితో పాటు వేర్పాటువాదం వంటి సమస్యలు తలెత్తాయి. పార్టీలో ఒడిదుడుకులు కొన్నాళ్లే.. స్పీడు బ్రేకర్ ఉన్నప్పుడు వేగంగా వెళ్తే ప్రమాదం. అందుకే నెమ్మదిగా దాటుతాం. పార్టీని కాపాడుకోలేకపోతే బొక్కబోర్లా పడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనటానికి విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి సోమవారం రాత్రి ఆంకోసా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరిన హెలికాప్టర్లో తానూ ప్రయాణించాల్సి ఉందని సీఎం తెలిపారు. ‘‘అదృష్టమో, దురదృష్టమో నేను ఆఖరి క్షణంలో ఆ హెలికాప్టర్‌లో వెళ్లలేదు. వైఎస్ నాకు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి.. వీలుకాని ఒక పనిని అప్పగించారు. అది వ్యతిరేకమని భావించి నేను చేయలేనని చెప్పాను. దీంతో ఆ పని పెండింగ్‌లో పడింది. అందువల్ల ఆ హెలికాప్టర్లో వెళ్లలేకపోయాను’’ అని సుదీర్ఘంగా వివరించారు.


రాజీవ్, సోనియాగాంధీలకు వైఎస్ సన్నిహితంగా ఉన్నందువల్లే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీతో తన శత్రుత్వం ఎవరికోసం అని కిరణ్ వ్యాఖ్యానించారు. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై, ఆయన కుటుంబంపై టీడీపీ ఇంత అభాండాలు వేస్తున్నారంటే.. వైఎస్ కుటుంబంపై ప్రజల్లో నమ్మకం పోగొడితే కాంగ్రెస్ వీకవుతుందని, కాంగ్రెస్‌ను దెబ్బతీయొచ్చని టీడీపీ, ఇతర పార్టీలు కుట్రపన్ని ఈ విధంగా చేస్తున్నాయని అసెంబ్లీలో బాహాటంగా చెప్పిన వ్యక్తిని నేను’’ అని వివరించారు. వైఎస్‌కు తనపై అపారమైన విశ్వాసం ఉండేదన్నారు.


‘‘రాజశేఖరరెడ్డి గారి కొడుకు ఒక ఖూనీ కేసులో ముద్దాయి అయితే.. అసెంబ్లీలో టీడీపీ వారికి సమాధానం ఇవ్వటం కోసం చదవటానికి నాకు 60 రోజులు పట్టింది. సీబీఐ ఎంక్వైరీ వేసి, అంత ప్రధానమైన కేసు ఆయన కొడుకుపై ఉంటే.. ‘ఆ కేసు విషయంలో సమాధానం చెప్పటానికి నువ్వు ఏవిధంగా రెడీ అవుతున్నావు?’ అని వైఎస్ నన్ను ఒక్క రోజు కూడా అడగలేదు. సొంత కొడుకు కేసు, సీబీఐ కేసు, మర్డర్ కేసు.. ఎలా డిఫెండ్ చేస్తున్నావని ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను అడగలేదంటే నాపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోండి’’ అని కార్యకర్తలను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. అందువల్ల వైఎస్‌కు తామే వారసులమవుతామని చెప్పారు.


సీఎం కాకముందు సోనియాను 4 సార్లే కలిశా...

‘‘ఢిల్లీతో నాకు సంబంధాలు లేవు. సీఎం కాకముందు నేను సోనియాగాంధీని నాలుగు సార్లే కలిశాను. నా తండ్రికి పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధీలతో సంబంధాలున్నాయి. దాంతో నేనే పీవీకి దగ్గరయ్యా. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వైఎస్‌కు కూడా నేనే అపాయింట్‌మెంట్ ఇప్పించా. అప్పట్లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన నన్ను మంత్రివి అవుతావంటూ బెస్టాఫ్‌లక్ చెప్పారు. అలా చెప్పిన 20 ఏళ్లలో ఏనాడూ మంత్రిని కాలేకపోయాను. ఇప్పుడు ఏకంగా సీఎంనయ్యా. మంత్రి పదవినిచ్చి వుంటే నేను సీఎం అయ్యేవాణ్ణికాదేమో. వైఎస్ నన్ను స్పీకర్‌ను చేయడం వల్లే నేనీనాడు సీఎంనయ్యా. మన చేతుల్లో ఏమీ ఉండదు. నుదిటిపై ఏది రాసుంటే అదే అవుతుంది..’’ అని కిరణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ దివంగతులయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందనడంలో వాస్తవం లేదన్నారు. గతంలో ఇందిరా, రాజీవ్‌గాంధీలు మరణించినప్పుడు కూడా అలాగే ప్రచారం చేశారన్నారు. తానెన్నటికీ వైఎస్ అభిమానినేనని చెప్పుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కన్నబాబు, ముత్యాల పాప, ఎమ్మెల్సీ సూరిబాబు, మేయర్ పులుసు జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment