Sunday, January 9, 2011

రాజకీయ సెగలు పొగలు

Jagana 
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జగన్‌ దూకుడును అణచివేస్తానన్న రెండు హామీలు ఇచ్చి, ఆ మేరకు ముఖ్యమంత్రి పదవి సాధించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సామర్థ్యానికి కాంగ్రెస్‌ అధి ష్ఠానం అగ్నిపరీక్ష పెట్టింది. ఈనెల 11న జగన్‌ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకాకుండా అడ్డుకోవాలన్నదే అధిష్ఠానం పెట్టిన పరీక్ష. ఇందులో ముఖ్యమంత్రి పాసవుతారో, ఫెయిలవుతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఆదివారం జగన్‌తో వెళ్లకపోయినా 11న ఉదయం వెళ్లే అవకాశం ఉంది. ఆ ఫలితం బట్టే కిరణ్‌కుమార్‌ రాజకీయ భవితవ్యం, ముఖ్యమంత్రి పదవి పదిలమా కాదా అన్నది కూడా స్పష్టం కానుంది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పుడు ఆ పదవి ముళ్లకిరీటంలా మారింది.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల నివేదికలు అందచేస్తూ అధిష్ఠానానికి దగ్గరయి, అదే సంబంధాన్ని విని యోగించుకుని సీఎం పదవి పొందిన కిరణ్‌కు సొంత పార్టీలోనే సెగ పెరిగి, చివరకు అది వ్యక్తిగతంగా తనకు, తన పదవికి ఎసరు తెచ్చే ప్రమాదం తెస్తోంది. అధిష్ఠానం హెచ్చరికల నేపథ్యంలో కిరణ్‌ జిల్లా మంత్రులను ఆశ్రయించవలసి వస్తోంది. తాను విఫలమయితే, మంత్రులుగా మీరు కూడా విఫలమయి నట్టేనని, ప్రభుత్వం కూలిపోతే మీ పదవులు కూడా పోతాయని హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నెల 11న జగన్‌ రైతాంగ సమస్యలపై ఢిల్లీలో జరపతలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధమవుతుండటం కిరణ్‌కు కలవరం కలిగిస్తోంది.

speaking వారిని ఢిల్లీ వెళ్లకుండా నివారించి, సత్తాను చాటుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో సీఎం సతమతమవుతున్నారు. నేరుగా వారితో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులశక్తి సామర్థ్యాలపై ఆధారపడి వస్తోంది. జగన్‌ ధర్నాకు వెళితే తన పదవికే ముప్పు వస్తుందన్న ఆందోళనతో సీఎం గత రెండు రోజుల నుంచి మంత్రాంగం నడుపుతున్నారు. ఆ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రు లు, మంత్రులపై బాధ్యత పెట్టారు. ‘జగన్‌ వెంట ఎమ్మెల్యేలు వెళితే ప్రజల్లో పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మీరంతా మంత్రివర్గంలో ఉన్నారు. ప్రభుత్వం పడిపోకుండా ఉండే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. మీ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడండి.

వారిని ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోండి. హై కమాండ్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టండి’ అని సీనియర్లను అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును పిలిపించి చర్చించారు.దాదాపు 31మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కిరణ్‌కు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. నిజంగా వారంతా ఢిల్లీకి వెళితే తనపై అధిష్ఠానం ఉంచిన విశ్వాసం, సీఎం పదవి తీసుకునే ముందు అధిష్ఠానానికి తానిచ్చిన భరోసా రెండూ తప్పినట్లేనని కిరణ్‌ భావిస్తున్నారు. అటు అధిష్ఠానం కూడా జగన్‌ ధర్నా వ్యవహారం తనకు సంబంధం లేనట్లు, అది పూర్తిగా కిరణ్‌ సామర్థ్యానికి సవాలు, పరీక్షగా భావిస్తోంది.

ఇదే భావన పార్టీ వర్గాల్లోనూ కనిపిస్తోంది. 11 నాటి జగన్‌ దీక్షకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయితే, అధిష్ఠానం కిరణ్‌ను అసమర్థ ముఖ్యమంత్రిగా పరిగణించే అవకాశాలు లేకపోలేదని, ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకుని, సత్తా చూపలేని వైఫల్య ముఖ్యమంత్రిగా భావిస్తే ఆయన పదవికే ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.ఒకవేళ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సూచనలు, అభ్యర్థలను బేఖాతరు చేసి ఢిల్లీ వెళితే కిరణ్‌ కూడా రోశయ్య బాటనే పయనించవలసి వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. అప్పుడు అధిష్ఠానం మరొకరిని నియమించే పరిస్థితి తలెత్త కుండా తానే స్వయంగా రాజీనామా చేయవలసిన వస్తుందని చెబుతున్నారు.

‘మా పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళితే అది నిజంగా కిరణ్‌కుమార్‌కు అవమా నమే. సీఎంగా అవకాశం ఇచ్చినా వారిని నియంత్రిం చలే కపోయారన్న అపప్రధను మూటకట్టుకోవలసి ఉంటుంది. ఇది కిరణ్‌ సత్తాకు అసలు సిసలు అగ్ని పరీక్ష. పాసయితే పదవిలో ఉంటారు. ఫెయిలయితే పదవీచ్యుతుడవుతారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే కిరణ్‌ గౌరవంగా రాజీనామా ఇవ్వడమే మంచిద’ని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. ఒకవైపు ఎమ్మెల్యేలను ఢిల్లీ వెళ్లకుండా కట్టడి చేసే యత్నాల్లో సీఎం బిజీగా ఉంటే, మరోవైపు ఆయన సొంత జిల్లాలో తనపై మొదలయి అసమ్మతి సెగ, తిరుగుబాటు కిరణ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రాజెక్టు సాధన, నిధుల నిలిపివేతకు నిరసనగా తనకు వ్యతిరేకంగా ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నుంచి దాదాపు పదివేల మందితో పాదయాత్ర ప్రారంభించేందుకు నిర్ణయించడం, దానికి ఆరు నియోజకవర్గాల నుంచి కార్యకర్తల సమీకరణకు సన్నాహాలు చేస్తుండటంతో కిరణ్‌కు సొంత జిల్లా వైపు కూడా దృష్టి సారించ వలసి వస్తోంది.జిల్లాలో తన పరువు కాపాడేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలను ఆపాలంటూ మంత్రిరఘువీరాను దూతగా నియమించినా, ఆ ప్రయత్నలు కూడా విఫలమవడం కిరణ్‌ను నిరాశకు గురిచేశాయి. ఈ విధంగా అటు ఢిల్లీ, ఇటు చిత్తూరు పరిణామాలతో నల్లారి నలిగిపోతున్నారు.

చిత్తూరు ‘తూటా’

cm-srఈనెల 11న ఢిల్లీలో జగన్‌ తలపెట్టనున్న ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అడ్డుకునే పనిలో తలమునకలయి ఉన్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత జిల్లాలోనే చుక్కెదురయ్యింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్షంగా సీఎంకు వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి సిద్దం అయ్యారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరును ప్రభుత్వం విస్మరిస్తే సహించేంది లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి తాగునీరు అందకుంటే పోరాటం తప్పదన్నారు. ఆ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టాలని నిర్ణయించారు. అయిదే, మహాపాదయాత్రను ఆపేందుకు జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి రఘవీరారెడ్డి రంగంలోకి దిగినా నియోజకవర్గ జనం కోసం పాదయాత్ర తప్పదని పెద్దిరెడ్డి విస్పష్టంగా చెప్పారు.

దీంతో సిఎం తన జిల్లాలోని పార్టీ శ్రేణులను కూడా కలుపుకుపోలేని పరిస్థితి నెలకొంది. శనివారం పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తుండగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘవీరారెడ్డి పెద్దిరెడ్డికి ఫోన్‌చేసి పాదయాత్రను ఆపివేయాలని కోరారు. దీంతో ఆయన పుంగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి సుమారు రూ.33.3కోట్ల వ్యయంతో స్థానిక పుంగమ్మ చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ను నిర్మిస్తున్నామని, సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు చేర్చడానికి సదుం మండలంలోని గార్గేయనది నుండి పైపులైను ఏర్పాటు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యలు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. గార్గేయనది నుండి సమ్మర్‌స్టోరేజ్‌ పైపులైను ఏర్పాటుకు సుమారు రూ.82కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.

ఈ సమ్మర్‌స్టోరేజ్‌ ప్రారంభమైతే సుమారు 60వేల మందికి దాహార్తిని తీర్చచ్చని పెద్దిరెడ్డి మంత్రి రఘువీరాకు వివరించారు. అయితే సిఎం వ్యక్తిగత ప్రయోజనం కోసం గార్గేయనది జలాలను పీలేరు నియోజకవర్గానికి మళ్లించడానికిప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మా నియోజకవర్గ ప్రజల కోసం తాను ఈ పాదయాత్రను చేపట్టానని ఇన్‌చార్జ్‌ మంత్రికి తేల్చిచెప్పారు. ప్రజల దాహార్తి తీరేంత వరకు ప్రజా ఉద్యమం ఆగదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు పుంగనూరు, కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, సత్యవీడు, శ్రీకాళహస్తి నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పెద్దిరెడ్డి పాదయాత్రకు తరలిరానున్నారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సతుం మండలాల మీదగా ప్రాజెక్టు ఉన్న పాపిరెడ్డి గారి పల్లెకు పాదయాత్ర చేరుకుంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే సెగ మొదలయినట్టయింది. పెద్దిరెడ్డి పాదయాత్ర ప్రారంభమయితే, సీఎంకు సొంత జిల్లాలోనే పట్టులేదన్న సంకేతాలు అధిష్ఠానానికి చేరే ప్రమాదం లేకపోలేదు. పెద్దిరెడ్డి పాదయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రచారం లభించే అవకాశం ఉంది. బహుశా ఆయన ఆ వ్యూహంతోనే పాదయాత్ర చేపడుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో సొంతజిల్లా పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రించలేని నాయకుడు ఇక రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలను ఏవిధంగా నియంత్రించగలరన్న భావన విస్తృతమవుతే, అది కిరణ్‌కు వ్యక్తిగతంగా కూడా నష్టమేనంటున్నారు.

No comments:

Post a Comment