Friday, November 26, 2010

అందర్నీ కలుపుకొని పోతా - ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

 

సుపరిపాలన
అందర్నీ కలుపుకొని పోతా
శాంతిభద్రతలపై కఠినంగా ఉంటా
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ ఆశ నెరవేరుస్తా
అధిష్ఠానం ఆదేశం మేరకు కేబినెట్
జగన్ విషయం పార్టీ చూసుకుంటుంది
లీకేజీల్లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు


శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం
పెట్టుబడుల మజిలీగా హైదరాబాద్
ప్రతి 3 నెలలకూ ప్రభుత్వ పథకాల సమీక్ష
ప్రతిపక్షాలూ బలంగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు

రాజ్యాంగ హక్కులకు లోబడి ఏం చేసుకున్నా తప్పులేదు
శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లలో శాంతి నెలకొల్పి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి... 

ప్రజారోగ్యం, విద్యకే నా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
సంక్షేమ పథకాల్లో లొసుగులు తొలగించి పక్కాగా అమలు చేస్తాం
ప్రాణహిత, పోలవరంలకు జాతీయ హోదా సాధిస్తాం
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ చివరి కోరిక నెరవేర్చడానికి కృషి చేస్తా...
 

 పాలనలో నూతన విధానాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలనను అందిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్, రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని .. పరిశ్రమలకు పూర్తి భరోసాను కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 2014 ఎన్నికల్లో 41 ఎంపీలను గెలిపించి యువనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతిమ రాజకీయ కోరికను నెరవేర్చేందుకు పూర్తి ప్రయాత్నం చేస్తామని అన్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులందరితోనూ .. ప్రతిపక్ష నేతలందరి సలహాలు తీసుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను అభినందించినప్పుడు .. ఆయన సహకారం కూడా కోరానని అన్నారు. ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శాసనసభా ప్రాంగణంలోని సమావేశమందిరంలో విలేఖరులతో మాట్లాడుతూ .. రాష్ట్రాభివృద్ధి కావాలంటే మీడియా సహకారం కావాలని కోరారు. శాసనసభా స్పీకర్‌గా బుధవారం నాడు మీడియా కమిటీ సమావేశాన్ని శాసనసభా ప్రాంగణంలోనే నిర్వహించామని.. నేడు ఇదే ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నానని అన్నారు.

తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రజలకు సేవలు చేసేందకు వీలైన ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా రాష్ట్రానికి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే అంటోని, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ వచ్చి తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తాను సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. నూతన విధానాన్ని తెచ్చి .. మైనారిటీలు, ఎస్సీఎస్టీలు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ లీకేజీలు లేకుండా పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు సంబంధించిన 10-12 ప్రధానాంశాలను ఎన్నుకుని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపకార వేతనాలు, జాతీయ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ కార్యాలయాల్లో ధృవపత్రాల జారీ వంటివి పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రతి మూడు నెలల లక్ష్యాన్ని నిర్ధేశించి సమీక్షిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. గత ముఖ్యమంత్రులు వైఎస్, రోశయ్యలు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటిని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.రాష్ట్రంలోనూ.. హైదరాబాద్‌లోనూ ప్రత్యేకంగా పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతామని అన్నారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ మజిలీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ పెట్టుబడులకు సానుకూల వాతావరణం నెలకొల్పుతామని అన్నారు. విద్య, ఆరోగ్యాలకు తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
  
       రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాలు-1లో ఆయన సీఎంగా మొదటిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘శాంతిభద్రతల విషయంలో నేను చాలా గట్టిగా ఉంటాను.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు లోబడి ఏమైనా చేసుకుంటే తప్పులేదు. కానీ శాంతికి భంగం కలిగిస్తే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. డిసెంబర్-31వ తేదీ తదనంతర పరిణామాలపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కిరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ విషయమే ప్రశ్నించినప్పుడు ‘భవిష్యత్‌లో నా పనితీరే మీరడిగిన ప్రశ్నకు సమాధానం’ అని చెప్పారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో శాంతి నెలకొల్పి వాటిని పెట్టుబడులకు ఒక సుహృద్భావ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఆ పథకాలకు అత్యంత ప్రాధాన్యం
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన పథకాలు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన, రోశయ్య కొనసాగించిన పథకాలన్నిం టికీ అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తానని కిరణ్ వెల్లడించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో లొసుగులను అరికట్టి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజారోగ్యం, విద్యకే తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసేలా కొత్త విధానాలను సృష్టిస్తామని చెప్పారు.

ప్రజలకు ప్రధానంగా అవసరమైన పది నుంచి పన్నెండు అంశాలను ఎంపిక చేసి వాటిలో ఈ విధానాలను ప్రవేశ పెడతామనీ, వాటి పనితీరు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను ఈ వ్యవస్థల పనితీరుకు బాధ్యులుగా చేస్తామని చెప్పారు. ఇలా ఎంపిక చేసే అంశాల్లో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ(చౌకడిపోలు), విద్యార్థుల ఉపకార వేతనాలు, ఉపాధి హామీ పథకం, రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీ లాంటివి ఉంటాయన్నారు. వీటన్నింటిలోనూ లక్ష్యాలను నిర్దేశిస్తామని, ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని చెప్పారు.

పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా సాధిస్తాం

కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించడానికి రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కలుపుకొని కలిసికట్టుగా కృషి చేస్తామని కిరణ్ కుమార్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొనిపోతామని, వారి సహకారాన్ని తీసుకుంటామని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపినపుడు కూడా తాను ఇదే విషయం చెప్పానని అన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు రెండింటికీ జాతీయ హోదా సాధించేందుకు కృషి చేస్తామన్నారు. పథకాల అమలులో గత ఆరున్నరేళ్లుగా లొసుగులున్నాయని భావిస్తున్నారా? అని ప్రశ్నించినపుడు ‘పథకాల అమలులో కొన్ని లోపాలు ఎపుడూ ఉంటాయి... ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ వంటి వాటిలో. అందుకే కొత్త పద్ధతులు సృష్టించాలని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. జలయజ్ఞం, రాష్ట్ర పారిశ్రామికీకరణను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

వైఎస్ కోరిక... రాహుల్ ప్రధాని
‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోవడానికి నాలుగైదు రోజుల ముందు.. రాష్ట్రంలో 41 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని కేంద్రంలో రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలని భావించారు. ఇది ఆయన చివరి కోరిక. దానిని నెరవేర్చడానికి శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను’ అని కిరణ్ అన్నారు. ఈ మాటలన్నపుడు పక్కనే ఉన్న దానం నాగేందర్ బల్లపై మెల్లగా చప్పట్లు చరిచారు. విలేకరుల సమావేశం అని వెంటనే గ్రహించి మిన్నకుండిపోయారు. వైఎస్ చివరి కోరికను నెరవేర్చడంలో అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆయన మరోసారి అన్నారు. పదవీ ప్రమాణం కాగానే నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ వార్డులోని రోగులను కలవడానికి కారణం వైఎస్ ప్రాభవాన్ని తగ్గించడానికేనా అని ప్రశ్నించినపుడు.. కాదని కిరణ్ సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యానికి, విద్యకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికే తప్ప వేరే ఉద్దేశమేదీ లేదన్నారు.

కొంత సమయం ఇవ్వండి
మీరు ప్రతిపక్షంలో ఉండగా కుప్పం ప్రాజెక్టు లొసుగులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కదా, ప్రస్తుతం ఆ నివేదిక దుమ్ముపట్టిపోయి ఉంది, మీరు మళ్లీ దానిని వెలికి తీస్తారా? అని ప్రశ్నించినపుడు ‘ఇపుడే వచ్చాను కదా, నాకు కొంత సమయం ఇవ్వండి’ అని కిరణ్ సమాధానం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని ప్రశ్నించగా అధిష్టానంతో చర్చించాక వారు చెప్పిన ప్రకారమే విస్తరణ చేస్తానన్నారు. ఢిల్లీకి వెళ్లేదుంటే మీకు చెప్పే వెళతాను అని వివరించారు. మంత్రివర్గంలో ఎందరుంటారు? ప్రస్తుత మంత్రులే ఉంటారా? అన్నప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదు. పార్టీలో వర్గాలు, విభేదాలు గురించి ప్రస్తావించగా తాను పదవి చేపట్టినప్పటి నుంచీ 99 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి కలిసి వెళ్లారని వివరించారు. అందరినీ కలుపుకొనిపోతానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ప్రశ్నలడిగినపుడు ఆయన స్పందించలేదు.

ఎవరినీ ఫినిష్ చేయను
వైఎస్ చివరి కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తానంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోతుందని కూడా ఆయనే అన్నారు కదా, దానిని కూడా నెరవేరుస్తారా అని ఒక విలేకరి అన్నప్పుడు ‘లేదు, ఎవరినీ ఫినిష్ చేసే రాజకీయం చేయను. ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రతిపక్షం ఉండాలి’ అని కిరణ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

సోనియా, మన్మోహన్‌లకు కృతజ్ఞతలు
తనకు రాష్ర్ట ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అంతకుముందు కిరణ్ ప్రకటించారు. దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా తన ఎంపిక కోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఏ.కె.ఆంటోనీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం వరకూ తాను ఇక్కడ (అసెంబ్లీలో) స్పీకర్‌ననీ, మీడియా సలహా మండలి సమావేశంలో కూడా పాల్గొన్నాననీ, ఇవాళ సీఎంగా మీ ముందుకు వచ్చానని కిరణ్ తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా తనకు మీడియా మద్దతు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్ర : సీఎం ఆఖరి కోరిక అన్నారు. వైఎస్ ముందూ వెనుక చూస్తే తరచూ ముఖ్యమంత్రుల మార్పు బలహీనత కాదా ?

సీఎం : మా ముఖ్య ఉద్దేశం .. రాజశేఖరరెడ్డి చనిపోవడానికి మూడు రోజుల ముందు రాహుల్ గాంధీని 2014లో ప్రధానిని చేయాలని అన్నారు. రాజశేఖరరెడ్డి రాజకీయంగా ఒక కోరికో లేక ఆశ .. ఆయన ఆఖరి రాజకీయ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం.

ప్ర : లీకేజీలు నివారిస్తామని అంటున్నారు. ఆరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకేజీలు ఉన్నాయని అంగీకరిస్తారా ?

సీఎం : లీకేజీ అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి కోసం పెట్టిన పథకం వారికే చెందే విధంగా అమలు చేయాలని.. ఇప్పుడు కూడా లొసుగులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో గాని.. బియ్యం పంపిణీలో గాని.. ఆరోగ్యశ్రీలోగాని కొత్త సిస్టమ్ డెవలప్ చేసి పారదర్శకంగా అమలు చేస్తాం.

ప్ర : ఇంత మంది సీనియర్‌లు ఉండగా మిమ్మల్నే ఎందుకు సీఎంగా ఎన్నకున్నారు?

సీఎం : నేను ఎవ్వర్నీ కోరడం జరగలేదు. దానికి నేను సమాధానం చెప్పలేను.

ప్ర : వైఎస్‌కు అత్యంత ఇష్టమైన ఆరోగ్య శ్రీ సందర్శించడం ద్వారా ఆయన్ను మరిపించాలన్న ఉద్దేశం ఉందా ?

సీఎం : నేను మొట్ట మొదట నా ప్రభుత్వానికి , కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం సక్రమంగా ఉండాలని.. ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ మొదలు పెట్టారు కాబట్టి, దానిని పక్కన పెట్టాలని కాదు. దానిని మెరుగుపరచాలని వెళ్లాను. ప్రభుత్వ ప్రాధాన్యం విద్య, వైద్యం . అందుకే 'ఫస్ట్ గెస్చర్' గా ఆరోగ్య శ్రీ అమలును సమీక్షించాను. పేదవాడికి, అట్టడుగున ఉన్నవానికి డబ్బులేక వైద్యం అందకుండా పోకుండా ఉండేందుకే ఆరోగ్య శ్రీ పెట్టారు. దానిని మరింత బలోపేతం చేస్తాం. ఇలాంటి నెగిటివ్ ప్రశ్నలు వద్దు.

ప్ర : ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయి కదా?

సీఎం : ప్రజలకు గవర్నర్నెన్స్ ద్వారా పారదర్శకంగా పథకాలు అందేలా చూస్తాను.

ప్ర : మంత్రివర్గం ఎప్పుడు ? పాతదే కంటిన్యూ అవుతుందా ?

సీఎం : మంత్రివర్గం విషయం అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.

ప్ర : రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 41 లోక్‌సభ స్థానాలను తీసుకువస్తానంటే ప్రతిపక్షాలను ఫినిష్ చేస్తారా ?

సీఎం : రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నది వైఎస్ ఆఖరి కోరిక. ప్రతిపక్షాలను ఫినిష్ చేయాలన్న ఆలోచన లేదు. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి. ప్రజలకు మేలు జరుగుతుంది.

ప్ర : కాంగ్రెస్‌లో జగన్ వర్గాన్ని కలుపుకొని పోతారా ?

సీఎం : ప్రతి ఒక్క కాంగ్రెస్‌నేతనూ కలుపుకొని పోతాను

ప్ర : గత ఏడాదిగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది.. ప్రభుత్వం ఉందా అనే సందేహం నెలకొంది. సీఎంగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ?

సీఎం : నేను ప్రధాన అజెండాలోనే చెప్పాను. హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే 'ఫేవర్ డెస్టినేషన్' చేయాలంటే శాంతి భద్రతలను కాపాడితే తప్ప జరగదు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండడం జరుగుతుంది.

ప్ర : ప్రజల విజ్ఞాపనలు కోరికలు తెలుసుకోవడానికి సమయం కేటాయిస్తాను.

సీఎం : నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఐదారు గంటలయింది. కచ్చితంగా ప్రజల వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తాను. ఇదే ప్రధాన్యం.

ప్ర : పార్టీలో అందర్నీ కలుపుకుని పోతానని అన్నారు. కాని ప్రెస్‌మీట్‌లో యువకులే ఉన్నారు

సీఎం : నాకు నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా 99 శాతం మంది కలిశారు.

ప్ర : హైదరాబాదీనే అన్నారు. తెలంగాణ ఉద్యమంపై మీ అభిప్రాయం ?

సీఎం : నా వర్కింగే సమాధానం చెబుతుంది. శాంతి భద్రతల విషయానికి వచ్చే సరికి రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కులు ఏవీ కూడా భంగం కలగకుండా చేయడం జరుగుతంది. కాని భంగం కలిగే విధంగా ఉంటే కఠినంగా, కచ్చితంగా ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది.

ప్ర : డిసెంబర్ 31 తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తుంది కదా ?

సీఎం : ఇంకా ఇవ్వలేదు కాదా ? రిపోర్టు వచ్చాక చూద్దాం.

ప్ర : మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉంది కదా ?

సీఎం : ఇప్పుడే సీఎం బాధ్యత చేపట్టి ఐదారు గంటలైంది. మేనిఫెస్టోలో ఉన్నవాటినన్నింటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం.

ప్ర : తెలంగాణపై విషయంలో వైఖరి ?

సీఎం : దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తే దానిని అమలు చేస్తాం.

ప్ర : రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల సమస్యలపై ఎలా స్పందిస్తారు ?

సీఎం : సమస్యలను చర్చల ద్వారారే పరిష్కారం జరపాలి. ఇప్పటికే పన్నెండో .. పదమూడో సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వాటన్నింటితో రేపో ఎల్లుండో కూర్చుని చర్చించి పరిష్కరిస్తా. ఫస్ట్ కేబినెట్ రావాలి. తర్వాత టోటల్ ఫంక్షనింగ్ రాలేదు.

ప్ర : డిప్యూటీ సీఎం వస్తామంటున్నారు ?

సీఎం : నేను ఎవరు వచ్చినా .. అందర్ని కలుపుకొని పనిచేస్తాను.

ప్ర : చర్చలద్వారానే సమస్యల పరిష్కారం అంటున్నారు. మావోయిస్టులు చర్చకు వస్తామంటున్నారు.

సీఎం : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాని.. మావోయిస్టులు 13 జిల్లాల్లో ఉన్నారు. కేంద్రం చూస్తోంది. దీనిపై రాష్ట్రం ఏమీ చేయదు. యథాతథ స్థితి కొనసాగుతుంది.

ప్ర : మీపై స్థలానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి కదా?

సీఎం : స్థలానికి సంబంధించి వివాదమేమీ లేదు. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో 110 కేసులు ఉన్నాయి. నా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉందని తీసుకున్నాను. అయితే.. తక్కువ ధరకు తీసుకున్నానని ఒక మీడియా (ఆంధ్రజ్యోతి కాదు) పేర్కొంది. దీంతో ఆ స్థలం వాపసు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. ఇంకా వివాదం ఎక్కడ ఉంది.

ప్ర : పోలవరం జాతీయ హోదాకు ప్రయత్నం చేస్తారా ?

సీఎం : పోలవరం , ప్రాణహితకు జాతీయ హోదా కల్పించేందుకు ప్రయత్నం చేస్తాను.

ప్ర : పీఆర్పీ కేబినెట్‌లో చేరుతుందా ?

సీఎం : మీరు రాసినదానికి నేనేం సమాధానం చెబుతాను. అధిష్ఠానం నిర్ణయం మేరకు కేబినెట్ ఉంటుంది.

ప్ర : జగన్‌పై చర్యలు ఉంటాయా ?

సీఎం : జగన్ పై క్రమశిక్షణా చర్యలు అనేది .. పార్టీ వ్యవహారం. నేను ముఖ్యమంత్రిని. పార్టీ వేరు ప్రభుత్వం వేరు.

ప్ర : మీరు ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు ?

సీఎం : మీకు చెప్పే పోతాను. 

No comments:

Post a Comment