వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన కుమారుడు, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ ముఖ్య మంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా చేస్తున్నవి కావని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వరుస దీక్షలతో కాంగ్రెస్ శిబరంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ను, ఆయన శిబిరాన్ని చూసి శ్రేణులు ఆందోళన, భయం చెందకుండా ఉండేందుకే కిరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎదుటి పక్షాన్ని ఆత్మ రక్షణలో పడవేయటం ద్వారా శ్రేణుల్లో స్థయిర్యం నింపే ప్రయత్నాలను కిరణ్ ప్రారంభించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు మొట్ట మొదటిసారి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష వ్యాఖ్యలు చేసిన జగన్, రచ్చబండ కార్య క్రమం సందర్భంగా విశాఖ వెళ్ళినప్పుడు కార్యకర్తల పరిచయ కార్యక్రమ సమావేశంలో వాటిని మరింత తీవ్రతరం చేశారు. తాను బలహీనుడైన ముఖ్యమంత్రిని అని, అధి ష్ఠానం చెప్పినట్టు వినే కీలుబొమ్మనని జగన్ వర్గం నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకుఇక అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోవాలని కిరణ్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ యాత్ర సందర్భంగా తన ప్రభుత్వం ఎవరి దయా దాక్షిణ్యాలపైనా ఆధారపడి లేదని, నైతి కత ఉంటే జగన్ నిర్వహించే కార్యక్రమాలకు హాజ రయ్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వెళ్ళవచ్చునని కిరణ్ సవాల్ విసిరారు. జగన్ పార్టీకి ఏమి సేవ చేశారని ప్రశ్నించారు.
వైఎస్ కుటుంబం యావత్తూ పద వులు దక్కినందుకు పార్టీకే రుణపడి ఉండా లని మరో బాణం విసిరారు. ఈ సవాల్‌ను జగన్ వర్గం స్వీకరించలేక పోయింది. అందుకు బదులుగా చేతనైతే బహిష్కరించుకోవచ్చునని పెదవి చాటు మాటలు పలికింది తప్ప తమ వర్గానికి ఏదైనా చేయగల ధైర్యం ఉందని నిరూపించుకోలేక పోయింది. ఫలితం ఏదీ తేలక పోయినా తన ప్రభుత్వాన్ని పడవేయగలిగినంత సత్తా జగన్ వర్గం ఎమ్మెల్యేలకు లేదన్న వాస్తవం పార్టీ శ్రేణులకు వెళ్ళేలా చేయటంలో కిరణ్ విజయం సాధించగలిగారు. ఈ సవాల్ విసరటం ద్వారా జగన్ వర్గం ఎమ్మెల్యేలలో నైతికత లేదని, వారు రాజకీయ స్వార్థంతోనే అటువైపు వెళ్ళారన్న సంకేతాలను జనంలోకి తీసుకు వెళ్ళటంలోనూ కిరణ్ నెగ్గుకు రాగలిగారు.
తాజా వ్యాఖ్యల తీవ్రత అధికం...
ఇక తాజాగా కిరణ్ మరింత ముందుకు పోయి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన దివంగత వైఎస్‌తో పాటు జగన్‌ను సూటిగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు, వ్యాఖ్యలు వదిలారు. తాను 20 సంవత్సరాల పాటు కష్టపడితే తప్ప ముఖ్యమంత్రిని కాలేదంటూ జగన్‌లో ఆ ఓపిక లేదని, ఉన్నపళంగా గద్దె ఎక్కాలన్న ఆదుర్దా తప్ప ఆయనలో మరొకటి లేదన్న అభిప్రాయాన్ని కార్యకర్తల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వద్ద తానే అపాయింట్‌మెంట్ ఇప్పించానని చెప్పటం వాస్తవం అయినా కాకపోయినా తమది ఆది నుంచీ రాజకీయాలతో, కాంగ్రెస్‌తో పెనవేసుకుపోయిన కుటుంబం అని, అంత తక్కువ అంచనా వేయటానికి వీలు లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
ఉద్దేశ పూర్వకంగానే...
ఒక ఎమ్మెల్యే హత్య కేసులో ముద్దాయిగా పేర్కొన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ విమర్శల నుంచి రక్షించటానికి శాసనసభలో 60 రోజుల పాటు శ్రమించానన్నది కిరణ్ ప్రధాన వ్యాఖ్య. అప్పట్లో చీఫ్ విప్‌గా ఉన్న ఆయన జగన్ పక్షాన గట్టిగా వాదించిన మాట నిజమే...అయితే చీఫ్‌విప్‌గా అది తన బాధ్యత అయినప్పుడు దాన్ని ఇంతకాలం తర్వాత శ్రేణుల ముందు బయట పెట్టటం ద్వారా కిరణ్ ఉద్దేశ పూర్వకంగానే జగన్‌ను ఆత్మరక్షణలో పడవేసే ప్రయత్నం చేశారు. జగన్‌ను ముద్దాయి అని పేర్కొనటం ద్వారా విపక్షాలకు ఉప్పు అందించి ఆయా పార్టీల నాయకత్వాలు జగన్‌ను కడిగి పారేసేందుకు సహకరించటం సైతం కిరణ్ వ్యూహంలో భాగమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అంతా కిరణ్ అనుకున్నట్టే జరిగింది. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో వెలువడ్డాయో లేదో టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, జగన్‌పై ఆరోపణలను తీవ్రం చేశారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మాట్లా డుతూ కిరణ్ వ్యాఖ్యల ద్వారా పరిటాల రవి హత్య వెనుక జగన్ ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైందని సంచలన వ్యాఖ్య చేశారు. కిరణ్ వ్యాఖ్య సహజంగానే జగన్ శిబిరంలో కలకలం సృష్టించింది. ఆయన వర్గం నేతలు అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు లాంటి వారు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఖండించేందుకు శతవిధాల ప్రయత్నించారు.
మరో సంచలన వ్యాఖ్య...
జగన్‌పై చేసిందే సంచలన వ్యాఖ్య అయితే కిరణ్ ఆ వెనువెంటనే మ రో బాంబు పేల్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రచ్చబండ బయ లుదేరే సందర్భంగా తనను ఏదో పని చేయమని అడిగారని, నిబంధన లు అంగీకరించవంటూ దాన్ని తాను తిరస్కరించానని చేసిన వ్యాఖ్య సహజంగానే సంచలనం రేకెత్తించింది. ఆ పని ఏమై ఉంటుందన్న చర్చ అంతటా ప్రారంభమైంది. దీనిపై సైతం జగన్ వర్గం స్పందించిం ది. కిరణ్ చెప్పిన మాటలను బట్టి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై అను మానాలు వస్తున్నాయని, ఆయనను సైతం విచారించాలని డిమాండ్ చేసింది.
మరిన్ని సంచలనాలు?...
కిరణ్ వైఖరి చూస్తుంటే ఇక తాను సుతి మెత్తగా వ్యవహరిస్తే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం అవుతున్నది. మున్ముందు పార్టీ కార్యకర్తల సమావేశాలలో మరిన్ని సంచలన వ్యాఖ్యలను సంధించటం ద్వారా శ్రేణుల్లో మనోబలం నింపటం, స్థయిర్యం చేకూర్చి పార్టీని అంటిపెట్టుకుని ఉంచే ప్రయత్నం చేయటాన్ని కిరణ్ తీవ్రతరం చేయనున్నారు. అదే సమయంలో జగన్ వర్గాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడవేయటం ద్వారా వారి స్థయిర్యాన్ని దెబ్బ తీసే వ్యూహాన్ని సైతం కిరణ్ అమలు చేయనున్నట్టు విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశం స్పష్టం చేసిందని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
No comments:
Post a Comment