Sunday, November 28, 2010

కొంచెం గారంగా.. కొంచెం కారంగా !

konchemముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, గత రెండు రోజుల నుంచి వివిధ సందర్భాలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పరిశీలిస్తే.. తనకు ముందు ‘విజయవంతమైన ముఖ్యమంత్రులు’ గా పనిచేసిన వారిలో నచ్చిన అంశాలను తీసుకుని, ఆ మార్గం లో పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన రాజకీయ-పరిపాలనా పరమైన పద్ధతుల్లో చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి ముఖ్యమైన వ్యవహారాల్లో కొణిజేటి రోశయ్య దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఆలోచనా ధోరణి స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో సీఎం వ్యవహారశైలి గమనిస్తే.. కొంత కటువుగా, మరికొంత మృదువుగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది.

పరిపాలనకు సంబంధించిన విషయాల్లో బాబు దారిలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ధోరణి చెబుతోంది. ఐఏఎస్‌-ఐపిఎస్‌-ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశం, తొలిరోజు శాసనసభలోని కమిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన తొలి మీడియా భేటీలో ప్రస్తావించిన అంశాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పరిపాలన పారదర్శకంగా ఉండాలని, గవర్నరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తానని, క్షేత్రస్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభిస్తానని చెప్పడం చూస్తే.. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత చేపట్టిన విధానాల దారిలోనే కిరణ్‌ కూడా నడుస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ఆయన సంస్కరణలు, అధికారులను ప్రజలకు జవాబుదారీగా చేయడం వల్లే మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఆ క్రమంలో అధికారులతో కఠినంగా వ్యవహరిం చడం ద్వారా ఫలితాలు రాబట్టగలిగారు. ఇప్పుడు ఉత్తమ ముఖ్యమంత్రిగా తాను కూడా అలాంటి సంస్కరణల ద్వారానే ప్రజలకు దగ్గరవాలని కిరణ్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక పేద ప్రజలకు సాయం, ప్రజలకు అందుబాటులో ఉండే అంశాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ఆయన ధోరణి చాటుతోంది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే నిమ్స్‌లోని ఆరోగ్యశ్రీ వార్డును సందర్శించడం ద్వారా తాను కూడా వైఎస్‌ మాదిరిగానే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తానన్న సంకేతాలు పంపించారు. ప్రతి ఒక్క పథకం పేదలకు అందాలని, పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేయడం ద్వారా.. వైఎస్‌పై ఉన్న పేదల ముద్రను తాను కొనసాగిస్తానని చెప్పగానే అర్ధమవుతోంది. రాజశేఖరరెడ్డి మాదిరిగానే కిరణ్‌ కూడా మొదట్లో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ నుంచే పరిపాలన కొనసాగిస్తుండటం ప్రస్తావనార్హం.

ఇక అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం నిస్సందేహంగా రోశయ్య దారిలోనే నడవనున్నారు. అది అనివార్యంగాకూడా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలలో కోత విధించడం ద్వారా ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు రోశయ్య అమలుచేసిన వ్యూహాన్నే కిరణ్‌ కూడా అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘పథకాలలో ఉన్న లొసుగులను తొలగించి, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందివ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమ’ని కిరణ్‌ చెప్పారు. గతంలో రోశయ్య కూడా ఇదేరకంగా తేనెలాంటి ప్రకటనలు చేసి, ఆ తర్వాత బడుగు బలహీనవర్గాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌, ఫీజుల రీఇంబర్స్‌మెంట్‌లో కోత విధించడంతో పాటు, లబ్ధిదారుల సంఖ్యను సగానికి పైగా తగ్గించడం ద్వారా ఖజానాపై పడిన భారాన్ని తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాను కూడా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోశయ్య బాటలోనే నడవక తప్పేలా లేదని కిరణ్‌ తొలి మీడియా భేటీలో చెప్పకనే చెప్పారు.

1 comment:

  1. GOOD LUCK TO SHRI KKR JI,ALL SUCCESS IN YOUR LIFE AND IN GOVERNANCE,YENDARO MAHANUBAVULU ANDHARIKI VANDHANALU,MUKYAMGA SHRI POTTI SRIRAMULU GARIKI NAA VANDANAMULU DHAYACHESI AYANA CHESINA TYAGAANNI MARICHI RAASTRANNI PAALINCHAVDDHU,JAIHIND JAI ANDHRA.

    ReplyDelete