కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ పార్లమెంటు సభ్యుల దీక్ష రూపంలో కొత్త కష్టం వచ్చిపడింది. సొంత పార్టీకి చెందిన తెలంగాణ పార్ల మెంటు సభ్యులు దీక్షకు దిగడంతో పాటు, కేసుల ఎత్తివేతలో ఎంపీలు తన నిర్లక్ష్యవైఖరిని బహిరంగంగానే విమర్శిం చడం కిరణ్ కుమార్‌రెడ్డిని కొత్త సమస్యల వైపు నెట్టినట్టయింది. తాజా పరిణా మాలన్నీ తెలంగాణ విద్యార్థుల దృష్టిలో ‘సీఎం తెలంగాణ వ్యతిరేకి’గా ముద్ర పడేందుకు కారణమవుతున్నాయన్న వ్యా ఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాను హైదరాబాదీ నేనని ఉస్మానియా విద్యార్థినేనని కిరణ్ ఎన్నిసార్లు చెప్పినా, అవి ప్రస్తుత పరిస్థితిని చల్లార్చేలా కనిపించడం లేదు. తెలం గాణ ఉద్యమంలో విద్యార్థుల మీద పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులను బేషరతుగా తొలగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు దీక్షకు దిగడం సీఎంని రాజకీయంగా ఇరుకున పడవేసింది. ఇది సొంత పార్టీ ఎంపీలనే సీఎం నియంత్రిం చలేకపోయారని, ఇక మామూలు నేతలను ఏం నియంత్రి స్తారన్న సంకేతాలు వెళ్లడమే దానికి కారణం.
ప్రభు త్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేసేందుకు దీక్షలు, ఆందోళ నలు చేస్తాయంటే దానిని అర్థం చేసుకోవచ్చని, కానీ సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే దీక్షకు దిగడం వల్ల ప్రభుత్వం విఫలమయిం దన్న భావన ప్రజల్లో పాతకు పోతే వ్యక్తిగతంగా ఒక సీఎంగా అది తనకే అప్రతిష్ఠగా పరిణమించే ప్రమాదముందని కిరణ్ ఆందోళనలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత జరగనున్న పరిణామాలు కఠినంగా ఉంటాయని, అది కూడా టీఆర్‌ఎస్-టీడీపీ పోటాపోటీ రాజకీయ వ్యూహాల వల్ల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంటుందేమోనని అందరూ భావిస్తున్నారు.
అయితే అంతకంటే ముందే ఆ ప్రమాదం సొంత పార్టీ ఎంపీల నుంచే ముంచుకురావడం కిరణ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిణామాలు ఆయనను కలవరపరు స్తున్నాయి. జానారెడ్డి, జైపాల్‌రెడ్డిలో ఒకరు ముఖ్యమంత్రి అయితే ఈ పరిస్థితి ఉండేది కాదని ఎంపీ సర్వే సత్య నారాయణ మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించటం, దానిని మిగిలిన ఎంపీలు బలపరచడం బట్టి.. కిరణ్ కుమార్‌రెడ్డిని తెలంగాణ ఎంపీలు ఆమోదించడం లేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
కేవలం ముఖ్యమంత్రి మొండివైఖరి వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని, తాము ఈనెల 20నే సీఎంను కలసి కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని స్పష్టం చేసినా కిరణ్ దానిని లెక్కచేయకుండా మాట్లాడారని, అందుకే తాము నిస్సహాయ పరిస్థితిలోనే దీక్ష చేయవలసి వచ్చిం దని దీక్షలో పాల్గొన్న ఎంపీలు బాహాటంగానే మీడియాకు స్పష్టం చేస్తుండటం కూడా ముఖ్యమంత్రికి ఇబ్బంది కరంగా పరిణమించింది. దీనివల్ల కేవలం తన కారణం గానే కేసుల ఎత్తివేత అంశంలో ప్రతిష్ఠంభన ఏర్పడిం దన్న ఎంపీల ఆరోపణలను తిప్పికొట్టలేక ఇబ్బందిపడు తున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తూ జరుగుతున్న ప్రచారం వ్యక్తిగతంగా కూడా కిరణ్‌కు సైతం రాజకీయంగా నష్టంగానే భావిస్తున్నారు. దీక్ష విరమణకు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు వంటి మంత్రులు వెళ్లినా వారి ఎదుట కూడా ఎంపీలు ‘దీనికి కారణం ముఖ్యమంత్రేన’ంటూ సర్వే వంటి ఎంపీలు ముఖం మీదే స్పష్టం చేయడం బట్టి.. తెలంగాణ ఎంపీలు కిరణ్ తీరుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోంది. చివరకు మంత్రులను కూడా ఎంపీలు ఖాతరు చేయక పోవడం ద్వారా ప్రభుత్వానికి-కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల మధ్య దూరం పెరిగిందన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులన్నీ ఎత్తివేసేవరకూ చర్చించడం కుదరదని సీడబ్ల్యుసీ సభ్యుడిగా వ్యవహరించి, ఒక రాష్ట్ర ఇన్చార్జిగా పనిచేస్తున్న కేశవరావు వంటి సీనియర్లు కూడా నిర్మొహమాటంగా మాట్లాడటం కిరణ్ సర్కారును చిక్కుల్లో పడవేసింది.
డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తు తాయని, తనకు అధిష్ఠానం కేవలం 3 నెలలు మాత్రమే గడువు విధించిందన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశ మయిన నేపథ్యంలో.. సొంత పార్టీ నుంచే, అదీ తెలం గాణ రూపంలో సెగ తగలడంతో కిరణ్ ఆత్మ రక్షణలో పడిపోయారు. తెలంగాణలో పోలీసు దళాలను మోహరిం చడాన్ని టీఆర్‌ఎస్-టీడీపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా నిరసిస్తున్నారు. వారిని వెనక్కి పంపిస్తే ఆ తర్వాత జరిగే ఘర్షణ పరిస్థితిని నియంత్రిం చడంలో విఫలమవుతే దానిని కారణంగా చూపించి తనను తప్పిస్తా రన్న భయాందోళన కూడా ఆయనలో లేకపోలేదు. బలగాలను మోహరించి, వారితో ఉద్యమాన్ని అణచివేస్తే తెలంగాణ వాదులు రేపే ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడం ఇంకా కష్టమవుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.
సొంత పార్టీ ఎంపీల దీక్ష అనంతర పరిణా మాలు సీఎం్‌కు- తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య సమ న్వయం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ సంకే తాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లడం ఆయనకూ ప్రతిష్ఠాత్మ కంగా పరిణమించింది. సీఎం- మంత్రులు చెప్పినా వినని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకం లో నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక డిసెంబర్ తర్వాత తలెత్తే రాజకీయ పరిణామాలు ఇంకెంత తీవ్రంగా ఉంటా యోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. మొత్తానికి ఎంపీలు- శాసనసభ్యులతో సీఎంకు సాన్నిహిత్యం గానీ, సమన్వయం గానీ లేదన్న వాస్తవాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.