ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురై బతుకులు అతలాకుతలం అవుతున్న రైతాంగాన్ని కొంతమేరనైనా ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్ ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆమరణ నిరశన దీక్ష, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 21, 22 తేదీలలో తలపెట్టిన 48 గంటల నిరశన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.
పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.6,000 చెల్లిస్తా మన్నారు. గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు మరో రూ.1,500 పెంచామన్నారు. అలాగే గేదెలు, ఆవులకు రూ.15,000, దూడలకు రూ.10,000, గొర్రెలకు రూ.2,000, పౌల్ట్రీ రంగానికి రూ.40,000 చెల్లిస్తామని తెలిపారు. చేనేత రంగంలో మగ్గానికి రూ.5,000, రంగు మారిన, తడిసి పోయిన నూలుకు రూ.5,000 చెల్లిస్తామనిమత్స్యకార రంగంలో చెడిపోయిన పడవలకు రూ.5,000, పెద్ద పడవలు, వలలు నష్టపోయిన వారికి రూ.10,000 చెల్లిస్తామన్నారు.
ప్రధానమంత్రికి లేఖ
15 మాసాల్లో ప్రకృతి ఐదు పర్యాయాలు ఆగ్రహించిందని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీలో ఉన్న సందర్భంగా మళ్ళీ మాట్లాడతామన్నారు. ఎఫ్‌సీఐ చైర్మన్ శుక్రవారం వస్తున్నారని, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు అంగీకరించే అవకాశం ఉందన్నారు. దెబ్బ తిన్న వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతోనే కొనాలని కోరామన్నారు. పంటల బీమా విషయంలో వీలైనంత సాయం చేస్తామని, ఇప్పటికి 483 మండలాలు గుర్తించగా, మరి కొన్నిటిని గుర్తిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో రుణాలు రీ షెడ్యూల్ చేస్తామని, మరోవైపు రబీకి తాజా రుణాలు ఇస్తామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ డబ్బు కోసం ఒత్తిడి చేస్తామని, కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తామన్నారు. ఇది రైతుల ప్రభుత్వం అని, అదే పంథా కొనసాగిస్తామన్నారు.
మౌలిక సదుపాయాలకు రూ.1,000 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే రూ.810 కోట్లకు టెఏండర్లు పిలిచామన్నారు. జాతీయ విపత్తు నిధుల విషయంలో తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్ళలో రూ.1,677 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఈ ఆరు సంవత్సరాలలో కేంద్రం నుంచి రూ.3,204 కోట్లు వస్తే రాష్ట్రం నుంచి రూ.3,375 కోట్లు కలిపి రూ.6,579 కోట్లు వెచ్చించామన్నారు.
కనీస మద్దతు ధర
కనీస మద్దతు ధరపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటామని, మిల్లర్లు ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాటన్ కార్పొరేషన్‌తో మాట్లాడుతున్నామని, మంచి ధర ఇప్పిస్తామన్నారు. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, ఇది వారి ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి అన్నారు.
No comments:
Post a Comment