Wednesday, December 22, 2010

నత్తనడకన నల్లారి పాలన * కిరణ్‌ బెంబేలు ! * సోనియాకు సవాల్‌ !

Secretariat
నల్లారి పాలన నత్తను తలపిస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి ఫైళ్ళు పెండింగ్‌ పెట్టబోనని స్పష్టం చేసిన సిఎంగారు తన మంత్రివర్గంలోని సభ్యులకు మాత్రం ఇప్పటి వరకు సహా యకులను, కార్యాలయాల సిబ్బందిని అందించలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మంత్రుల కార్యాలయాల నుంచి సాధారణ పరిపాలన శాఖ(జిఎడి)కి ప్రతిపాదనలు అంది దాదాపు నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రులకు సంబంధించిన ఆఫీసు వ్యవహారాల విషయంలోనే ఇంతగా నిర్లక్ష్యం ఉంటే ఇక రాష్ట్ర పరిపాలన వ్యవహారాల సంగతి మాటేమిటనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

సాధారణంగా మంత్రుల కార్యాలయాల్లో వ్యక్తిగత కార్యదర్శులు(పిఎస్‌), ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ(ఒఎస్‌డి)వ్యక్తిగత సహాయకులు(పిఎ), ప్రజా సంబం ధాల అధికారులు(పిఆర్వోలు)లతో పాటు అటెండర్ల కేటాయింపులు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్‌(డిడి) స్థాయికి మించి జాయింట్‌ డైరెక్టర్‌(జెడి) లేదా ఆపై స్థాయి అధికారులు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా, ఒఎస్‌డిలుగా పనిచేసే అవకాశం ఉంది. జాయింట్‌ డైరెక్టర్‌ హోదా కలిగిన అధికారుల డిప్యూటేషన్లకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి. జెడి స్థాయి అధికారులు మినహా మిగతా సిబ్బంది డిప్యూటేషన్లకు ఆయా శాఖల అధిపతుల ద్వారా ఆర్ధిక శాఖ అనుమతితో నియామకాలు జరిపే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పటి వరకు మంత్రుల కార్యాలయాల్లో సిబ్బంది కేటాయింపులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో మంత్రులు శాఖలపై ఇంకా పట్టుసాధించలేకపోతున్నారు. దీంతో సదరు మంత్రులు తమ పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ కొనసాగించాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే ఇష్టంలేని శాఖలు, ఆపై సహాయకులు(పిఎస్‌ లేదా ఒఎస్‌డి) లేకపోవడంతో ఏమి చేయాలో పోలుపోని పరిస్థితుల్లో మరికొందరు ఉన్నారు.

మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్ళే ముందు వారి పర్యటన(టూర్‌ ప్రోగ్రామ్‌)లకు సంబంధించిన వివరాలను సదరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు తెలియజేయాల్సి ఉం టుంది. అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. అధికారికంగా మంత్రుల వ్యక్తి గత కార్యదర్శులుగా ఖరారు కాని వారి నుంచి వచ్చే సమాచారాన్ని జిల్లా యంత్రాంగం బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తు తున్నాయి. ఇటీవల కొందరు మంత్రులు తమ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పర్యటించాల్సిన సందర్భాల్లోనూ తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా వారి వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది వెంట వెళ్తున్నారు.

కిరణ్‌ బెంబేలు !
Kiran-cmmవిజయవాడలో జగన్‌ చేపట్టిన లక్ష్య దీక్ష్య ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి దడ పుట్టిస్తున్నది. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా మంగళవారం నుంచి 48 గంటల పాటు దీక్షకు ఉపక్రమించిన జగన్‌కు జనం, కాంగ్రెస్‌ కార్యకర్తలు నీరాజనం పట్టడం, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు పీఆర్పీ, టీడీపీ నేతలు కలిసి రావడంతో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడ పడుతుందోనని సిఎంకు, పార్టీ పెద్దలకు భయం చుట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం మొదటి రోజునే కాంగ్రెస్‌కు చెందిన సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, పీఆర్పీ నుంచి ఇద్దరు దీక్షలో పాల్గొని బాహటంగానే జగన్‌కు మద్ధతు పలికారు. మరో వైపు సీమాంధ్రకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా జగన్‌కు మద్దతు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీలు మం గళవారం రాత్రికి, బుధవారం విజయవాడకు చేరుకుని జగన్‌ శిబిరంలో పాల్గొనే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. జగన్‌ దీక్ష బుధ, గురు వారాల్లో కూడా కొనసాగనుండటంతో ఇంకెంత మంది పార్టీ నేతలు జగన్‌ బాట పడతారోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పెద్ద నేతలకు ఆందోళన కలిగిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కొందరు జగన్‌ దీక్షపై మంగళవారం మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ అంత ర్గతంగా వారు కూడా దీక్షకు తరలి వచ్చిన జనం, నేతలను చూసి గుబులు పడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాంగ్రెస్‌అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై రైతుసమస్యలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగిన జగన్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు మద్దతు పలకడం కాంగ్రెస్‌ నాయకత్వం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిందని విని పిస్తోంది. తమ ఆదేశాలను ధిక్కరించి, పార్టీని సైతం లెక్క చేయకుండా ఊహించని విధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు జగన్‌ శిబిరంలో పాల్గొని బాహటంగానే అతనికి మద్దతు పలకడమే కాకుండా పాటు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికే వ్యతి రేకంగా వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నేతలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనున్నందున పార్టీ నేతలు ఇంకెంత మంది జగన్‌ వెంట క్యూలు కడతారోననే భయం కాంగ్రెస్‌ పెద్దలను వెంటాడుతున్నది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి మంగళవారం ప్రధానంగా జగన్‌ దీక్షపైనే దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌ దీక్షకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎంత మంది వెళ్ళారు, ఏ ప్రాంతం నుంచి అధికంగా వచ్చారు, జగన్‌ వెంట నడిచిన నేతలు ఏ ప్రయోజనాలు ఆశించి అటూ వెళు తున్నారు?, జగన్‌తో వారికి ఉన్న సంబం ధాలు, వ్యాపార లావాదేవిలపై సిఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు పార్టీ వైపు నుంచి సిఎం జగన్‌ శిబిరంపై సమాచారం సేకరించినట్లు విని పిస్తోంది. ఈ సమాచారంతో ఒక నివేదికను తయారు చేసి ఆయన పార్టీ హైకమాండ్‌కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

పీసీసీ, ఎఐసీసీ ఆరా
పార్టీ ఆదేశాలను, క్రమశిక్షణను ఉల్లం ఘించి జగన్‌ దీక్షలో పాల్గొన్న పార్టీ నేతల విషయంలో పీసీసీ ఆరా తీస్తున్నట్లు సమా చారం. జగన్‌ దీక్షలో పార్టీ నేతలు ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత మంది పార్టీ కార్యకర్తలు తరలి వెళ్ళారో వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని విజయవాడ కాంగ్రెస్‌ కమి టీతో పాటు ఆయా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ తరఫున ఆదేశాలు వెళ్ళినట్లు తెలు స్తోంది. హస్తినలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇప్పటికే ఈ మేరకు ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరో వైపు ఎఐసీసీ కూడా జగన్‌ దీక్షపై తన నిఘా వర్గాల ద్వారా సమా చారం సేకరించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
సోనియాకు సవాల్‌ !
Sonia-B
వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దయ నీయంగా, విషాదకరంగా మారింది. రెండు డజ న్లుకు పైన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ ఏర్పాటు చేసుకున్న వేదికపైకెక్కి ఇరవైనాలుగు గంటలు గడిచినా వారికి కనీసం షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ధైర్యం, దమ్ము కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయ కత్వానికి కరవయిన దయనీయ పరిస్థితి నెల కొంది. మంగళవారం విజయవాడ కృష్ణానది ఒడ్డున వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన లక్ష్యదీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు పీఆర్పీ, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హాజరుకావడం సంచలనం సృష్టించింది. రెండవరోజుయిన బుధవారం మరో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరు కానున్నారు.

ఒక రకంగా.. రాజకీయ చైత న్యానికి ప్రతీకగా భావించే విజయవాడ జగన్‌ మద్దతుదారుల బలప్రదర్శనకు వేదిక. జగన్‌ను చూసి కాంగ్రెస్‌ నిలువెల్లా వణికిపోతోంది. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర కూడా కరవ వుతోంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని సవాలు చేస్తారన్న ఊహలు ఆయనను ఒక పట్టాన నిలవనీయడం లేదు. 22 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీని సవాల్‌ చేస్తున్న జగన్‌ దీక్షకు బాహాటంగా మద్దతు ప్రకటించడం, అయినా వారికి కనీసం ఇప్పటివరకూ షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేయటం, చర్యలు తీసు కుంటామని పీసీసీ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకూ హెచ్చరించకపోవడం బట్టి.. కాంగ్రెస్‌ అధిష్ఠానం జగన్‌ విషయంలోఅడకత్తెరలో పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

విజయవాడలో జగన్‌ నిర్వహించిన తొలిరోజు లక్ష్యదీక్షలో ప్రసంగించిన ప్రముఖులంతా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపట్టారు. స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపు నిచ్చారు. అంబటి, జూపూడి ప్రభాకర్‌రావు, ప్రసన్నకుమార్‌రెడ్డి, రోజా, రాజశేఖర్‌, విజయచందర్‌, గట్టు రాంచందర్‌రావు, జక్కంపూడి విజయలక్ష్మి వంటి ప్రముఖు లంతా కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ ప్రసంగిం చారు. అయినప్పటికీ వేదికపైనే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాటిని కనీసం ఖండిం చలేదు. తమ పార్టీని విమర్శిస్తున్నా నోరు మెదపకుండా జనం చేసే చప్పట్లకు తన్మ యులయ్యారు. వారంతా జగన్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాదిరిగానే అత్యంత క్రమశిక్షణ గల సైనికులుగా కనిపించారు.

జగన్‌ దీక్షా శిబిరానికి 22 మంది ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ, వారిపై చర్యలు తీసు కోవాలా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసు కోవాలి? ముందు షోకాజ్‌ ఇవ్వాలా? వద్దా? ఇస్తే వారంతా పార్టీపై ఇక బాహాటంగానే తిరుగుబాటు చేస్తారా? అదే జరిగితే పార్టీ కొంప కొల్లేరవుతుందా? బుధవారం నాటి రెండవ రోజు దీక్షకు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరవుతే ఏం చేయాలి అన్న ప్రశ్నలు అధిష్ఠానాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం నాటి దీక్షకు మరో 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరయేందుకు సిద్ధమవు తోన్న వైనం నాయకత్వాన్ని కలవరపరు స్తోంది. నిజంగా అదే జరిగితే ఇక కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసు కుంటే, అసంతృప్తితో ఉన్న జగన్‌కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిస్తే కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి ఎక్కువ కాలం అవసరం లేదని నాయకత్వం అంచనా వేస్తోంది. ఒక్క షోకాజ్‌ నోటీసు ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెడుతుందన్న అదురు అధిష్ఠానంలో కనిపి స్తోంది. అందుకే ఈ విషయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు కళ్లెదుటే తనను ధిక్కరిస్తున్నా వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో ఉంది. ఈ విషయంలో పీసీసీ పరిస్థితి మరీ ఘోర ంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ డి..శ్రీనివాస్‌ అసలు పనిచేస్తున్నారా? లేరా అన్న అనుమానం ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ వైపు వెళుతున్నా కనీసం తన స్థాయిలో కూడా స్పందించి, వారిపై హెచ్చరికలు కూడా జారీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

అటు ఢిల్లీ నాయకత్వం కూడా రాష్ట్రంపై నిశితంగా దృష్టి సారిస్తోంది. జగన్‌ లక్ష్య దీక్షకు వస్తున్న జనాలు, ఎమ్మెల్యేల సంఖ్య, స్పందన వంటి అంశాలపై ఆరా తీస్తోంది. జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్‌ నే త వి.హన్మంతరావు మాత్రం జగన్‌కు మద్దతు నిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరతానని వెల్లడించగా, మంత్రి శంకర్‌రావు మరో అడుగు ముందుకేసి జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.జగన్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చర్యలపై తరచూ స్పందించే ఏఐసీసీ అధికార ప్రతినిధులు కూడా తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడం చూస్తుంటే.. జగన్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం ఎంత భయపడుతోందో? ఎవరిపై చర్యల కొరడా ఝళిపిస్తే ఏమి కొంపలు మునుగు తాయోనన్న ముందుచూపుతో తర్జనభర్జన పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment