Thursday, December 2, 2010

'' టార్గెట్ జగన్ '' కేబినేట్ శాఖలపై భగ్గుమన్న మంత్రులు * శాఖల కేటాయింపుపై ఆగ్రహం...

మరికొందరిదీ రాజీనామా బాటే
తాజా మంత్రుల నిరసన గళం
ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన వట్టి
వట్టి ఇంట్లో పది మంది మంత్రుల సమావేశం
ఆనం రాంనారాయణరెడ్డి రాయబారం విఫలం
పభుత్వమంటే ప్రైవేట్ కంపెనీ కాదన్న బొత్స
నేటి ఉదయం బొత్స ఇంట్లో మంత్రుల భేటీ

కెప్టెన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి బంతికే డకౌటయ్యారు. టీమ్ కూర్పులో, బ్యాటింగ్ ఆర్డర్ కేటాయింపులో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన తమకు ఫక్తు ‘జూనియర్ల’ తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చారంటూ సీనియర్లంతా భగ్గుమన్నారు. వైఎస్ సన్నిహితులకు అప్రాధాన్య శాఖలివ్వడం, ఆయన్ను, యువనేతను విమర్శిస్తున్న వారికి పెద్దపీట వేయడంపై మండిపడ్డారు. వట్టి వసంతకుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వట్టి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. లేఖ అందిన విషయాన్ని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్రువీకరించారు. బొత్స సత్యనారాయణ అయితే నేరుగా సీఎంకే ఫోన్ చేసి శాఖ కేటాయింపుపై భగ్గుమన్నారు. రాజీనామా చేస్తానని హెచ్చరించారు. పార్టీని నట్టేట ముంచాలనుకుంటున్నారా అంటూ నిలదీశారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదన్నారు. ధర్మాన ప్రసాదరావు నుంచి పొన్నాల లక్ష్మయ్య దాకా సీనియర్లంతా శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిలో చాలామంది ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. పదిమందికి పైగా మంత్రులు వట్టి నివాసంలో భేటీ అయ్యారు. వట్టిని బుజ్జగించేందుకు రామనారాయణరెడ్డిని ఆయన నివాసానికి సీఎం పంపినా, వెనక్కు తగ్గేదే లేదని వట్టి కుండబద్దలు కొట్టారు. అసంతృప్తులంతా కలిసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కెప్టెన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తన తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. మంత్రివ ర్గ ప్రమాణ స్వీకారం ముగిసిన పది గంటలు గడవక ముందే రాజీనామాల పర్వం మొదలైంది. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించారని, కుల సమీకరణల్లో అన్యాయం జరిగిందని కొందరు, అప్రాధాన్య పోస్టులని మరికొందరు, తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇంకొందరు, వై.ఎస్. సన్నిహితులను చిన్నచూపు చూశారని మరికొందరు నిరసన గళం విప్పారు. రాత్రికి రాత్రే వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో 10 మంది మంత్రులు భేటీ అయ్యారు. ఆ వెంటనే అప్రాధాన్య పోర్టుఫోలియో కేటాయించారంటూ వట్టి వసంత్‌కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణకు సంబంధంలేని పోర్టులు వంటి పోర్టుఫోలియోను తనకు కేటాయించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు.

ప్రయివేట్ లిమిటెడ్ కాదు..

కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ కూర్పు మంత్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్గించింది. సీనియర్లని కూడా చూడకుండా ఈరోజు ఉదయం 5 గంటల వరకు జాబితా వెలువరించకపోవడంతో అవమాన భారంతో రగిలిపోయారు. పోర్టుఫోలియోలు కేటాయించిన తరువాత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. రాజీనామా చేస్తానని బెదిరించినట్టు తెలిసింది. ‘పార్టీని నట్టేట ముంచాలనుకుంటున్నారా? ప్రభుత్వం అంటే ప్రయివేట్ లిమిటెడ్ కాదు..’ అని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇక మంత్రి వట్టి వసంత్‌కుమార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి శాఖ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేయడంతో ‘రేపు మాట్లాడుకుందాం..’ అంటూ సీఎం చెప్పినట్టు తెలిసింది. దీంతో వట్టి ఒక వ్యక్తికి రాజీనామా లేఖ ఇచ్చి సీఎం ఇంటికి పంపారు. అది తీసుకోవడానికి సీఎం సెక్యూరిటీ నిరాకరించారు. అనంతరం తన రాజీనామాను సీఎంకు ఫ్యాక్స్ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు.

అసంతృప్త మంత్రుల భేటీ

వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో దాదాపు పది మంది అసంతృప్త మంత్రులు సమావేశమయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాద్‌రావు, బొత్సా సత్యనారాయణ, విశ్వరూప్‌లు తమకు అప్రాధాన్య శాఖలు కట్టబెట్టి అవమానించారంటూ ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. కీలక శాఖలు మూడు సీఎం వద్దే పెట్టుకున్నార ని, సీనియర్లమైన తమను ఉదయం 5 గంటల వరకు వెయిటింగ్‌లో పెట్టడం కలచివేసిందని చర్చించినట్టు సమాచారం. మరోవైపు రాజీనామా చేయాలంటూ ధర్మాన ప్రసాదరావుకు తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం నుంచి 9 మందిని గెలిపించినందుకు ఇదా బహుమానం అంటూ ధర్మాన ఆవేదన వ్యక్తంచేశారు. మూడు శాఖలు కలిపి డీఎల్ రవీందర్‌రెడ్డికి ఇచ్చి.. తమ లాంటి వారికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ సీనియర్లంతా మండిపడ్డారు. బీసీలు, దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వట్టి ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. మరోవైపు పి.విశ్వరూప్‌కు కూడా కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని మీడియాలో ప్రచారం జరిగింది. జూపల్లి కూడా తీవ్ర అసంతృప్తితో సన్నిహితులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ కన్నా లక్ష్మీనారాయణ, తన శాఖలన్నీ కత్తిరించారంటూ డొక్కా మాణిక్యప్రసాద్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనుకున్న దామోదర రాజనర్సింహ కూడా నైరాశ్యంలో ఉన్నారు.

ముగ్గురిని గెలిపించా..

జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించి పార్టీకి కట్టుబడి ఉంటే తనకు లభించే గౌరవం ఇదేనా? అంటూ కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణకు సంబంధంలేని మంత్రి పదవిని తనకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వల్ప మెజారిటీతో బయటపడ్డ జానారెడ్డికి ప్రాధాన్యం గల పంచాయతీరాజ్ శాఖ కేటాయించి తనకు అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ మండిపడి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఖమ్మం నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి తనకు కేవలం ఉద్యానవన శాఖ కేటాయించడంపై అవమాన భారంతో రగులుతున్నారు. వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో భేటీ అయిన మంత్రులను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని పంపించారు. ఆనం చెప్పిన మాటలు వినేందుకు మంత్రులు సుముఖత వ్యక్తంచేయలేదు. మరోవైపు అసంతృప్త మంత్రులు అందరితో చర్చించి బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.


సీనియర్లలో అసంతృప్తి!

శాఖల కేటాయింపులో స్థాయి తగ్గించి అవమానించారంటూ సీనియర్లంతా రగిలిపోతున్నారు. వైఎస్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి మాజీ మంత్రులకు తాజా కూర్పు తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఆరున్నరేళ్ల పాటు వైఎస్ మానసపుత్రిక జలయజ్ఞం బరువు బాధ్యతలు మోసిన పొన్నాలకైతే అవమాన భారాన్నే మిగిల్చింది. భారీ నీటిపారుదల శాఖను చూసిన ఆయనకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ల శాఖతో సరిపెట్టారు.

పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చూసిన బొత్స సత్యనారాయణ రవాణా శాఖతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీసీసీ కిరీటం దక్కుతుందనుకున్న బొత్స సత్యనారాయణ పేరు మంత్రివర్గ జాబితాలో కనిపించడం కూడా ఆశ్చర్యపరిచింది. హోం శాఖను ఆశించిన జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ దక్కడంతో అసంతృప్తికే లోనయ్యారు. గతంలో వైద్యవిద్య బాధ్యతలు చూసిన సుదర్శన్‌రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ ఇచ్చారు. గతంలో ఐటీ శాఖ చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా విద్యుత్తు గానీ, రోడ్లు, భవనాల శాఖ గానీ ఆశించారు. పెట్టుబడులు, మౌలిక వసతులు కేటాయించడంతో అసంతృప్తికి లోనయ్యారు. గతంలో దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి ముగ్గురు కలిసి చూసిన కీలకమైన వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్తు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యశ్రీ, 104, 108, వైద్య మౌలిక వసతుల శాఖలన్నింటినీ కలిపి డి.ఎల్.రవీంద్రారెడ్డికి అప్పగించారు!

రెవెన్యూ శాఖ చూసిన ధర్మాన ప్రసాదరావుకు రోడ్లు, భవనాల శాఖ కేటాయించినా దానికి ప్రస్తుతం నిధులే లేవు. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను చూసిన వట్టి వసంత్‌కుమార్‌కు అప్రాధాన్యమైన పర్యాటక, సాంస్కృతిక శాఖను కేటాయించారు. వీటికి యువజన సర్వీసులు, క్రీడల శాఖను జోడించినా.. వసంత్‌కుమార్‌కు తీవ్ర అసంతృప్తినే మిగిల్చింది. వైద్య, ఆరోగ్య శాఖ చూసిన దానం నాగేందర్‌కు అంతగా ప్రాధాన్యం లేని కార్మిక శాఖను కేటాయించడంతో ఆయన కూడా నిరాశకు లోనయ్యారు. గతంలో బీసీ సంక్షేమ శాఖ చూసిన ముఖేష్‌గౌడ్ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖపై మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖ చూసిన జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

No comments:

Post a Comment