Thursday, December 23, 2010

బాబూ .. రైతుబాంధవుడే ...

Kiran-Kumar-Reddy1
తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు రైతుల సమస్యల్ని పట్టించుకోలేదని, వ్యవసాయం దండగ అన్నారని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేతను విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి నిరాహారదీక్ష చేపట్టిన బాబును దీక్ష విరమించమని తను స్వయంగా కోరానని, చర్చలకు మంత్రుల్ని పంపించానని, అయినా ఫలితం లేకపోయిందని కిరణ్‌కుమార్‌ చెప్పారు. ‘రైతు బాంధవుడివి అనిపించుకున్నావు. ఇక దీక్ష విర మించు’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం కిరణ్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ‘బాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు...కరెంటు సమస్య పరిష్కరించాలని 98 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షచేస్తే అధికారులు, టిడిపి నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు దీక్ష విరమించమని మేం పదేపదే అడుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు మెత్తని స్వభావం కలిగిన కాంగ్రెస్‌ నాయకులం దీక్ష వద్దని పదే పదే కోరినా బాబు స్పందించలేదు’ అని ఆయన విమర్శించారు.

గతంలో ...
గతంలో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన వారి గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జలగం వెంగళరావు, మర్రిచెన్నారెడ్డి లాంటివారు కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, తిరిగి పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందారని చెప్పారు. ‘రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. ఈ సమయంలో పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ముఖ్యమంత్రి పరోక్షంగా కడప మాజీ ఎంపి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు.
రైతు రుణాలు రీ షెడ్యూల్‌
వరదలు వచ్చి ఆరు జిల్లాల్లో రైతులు నష్ట పోయారని , వారు తీసుకున్న బ్యాంకు రుణాల్ని రీషెడ్యూల్‌ చేస్తామని, ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వరద ప్రాంతాలలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ, 400 కోట్లు ముందస్తు సహాయం కింద మంజూరు చేసిందని, గడిచిన 6 సంవత్సరాలలో వరదల్లో నష్ట పోయిన రైతుకు తమ ప్రభుత్వం రూ, 8 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, 9 ఏళ్ల టిడిపి పాలనలో కేవలం 33 కోట్లే ఖర్చు పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరు రైతుల పక్షపాతో ప్రజలే నిర్ణయించాలన్నారు.అతి త్వరలో రచ్చబండ కార్యక్రమాన్ని పనరుద్ధరిస్తున్నామని, ప్రజల దగ్గరే సమస్యలు పరిష్కారం అవుతాయని, అక్కడిక్కడే సంబంధిత శాఖ అధికారులను పిలించి పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ ఆందోళనగా ఉన్నట్టు కనిపించారు. ఆయన జిల్లా పర్యటనకు వచ్చేదారిలో టీఆర్‌ఎస్‌, టిడిపి, జగన్‌ వర్గం నాయకులు కిరణ్‌ కాన్వయిని అడ్డుకున్నారు. పోలీసుల ఆందోళన కారులను చెదరగొట్టి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

అయితే, ఆయన మాత్రం ప్రసంగంలో తడబాటుకు గురయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో మడమ తిప్పలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 28 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు అందేశామని, అందుకు అయిన 21 వేల కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వమే భరించిందనీ చెప్పారు. రాష్ర్టంలో ఒకే సమయంలో అతివృష్టి అనావృష్టి సంభవిస్తే తట్టుకోలేమని గుర్తించిన వైఎస్‌ 86 ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి సంవత్సరం 3,4 వేల టీఎంసీల నీరు ఆదా చేసుకోవచ్చన్నారు.

No comments:

Post a Comment