Thursday, November 25, 2010

సీఎం కిరణ్

స్పీకర్‌ను వరించిన ముఖ్యమంత్రి పీఠం
ఎంపిక చేసిన సోనియా.. గురువారం 12.15కు ప్రమాణం

డిప్యూటీ సీఎంగా గీతారెడ్డి?
పీసీసీ చీఫ్‌గా బొత్స సత్తిబాబు?

రాష్ట్రంలో మెరుపులాంటి మార్పులు
24 గంటల్లో మారిన రాజకీయం
రోజంతా వాడివేడిగా హైడ్రామా
గంటల్లోనే ముఖ్యమంత్రి మార్పు
కొత్త సీఎంపై సీఎల్పీ తీర్మానం
మేడమ్ సోనియా చేతికే అధికారం
కొన్ని నిమిషాల్లోనే సస్పెన్స్‌కు తెర
కొత్త సీఎంను ప్రకటించిన ప్రణబ్
ఇరవై నాలుగు గంటలు! సరిగ్గా 24 గంటలు! రాష్ట్ర రాజకీయం మారిపోయింది. రోశయ్య వెళ్లిపోయారు. కొత్త ముఖ్యమంత్రిగా స్పీకర్ కిరణ్ కుమార్‌రెడ్డి వచ్చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోశయ్య రాజీనామా చేస్తున్న విషయం బయటికి పొక్కింది. రాత్రి 10 గంటలకల్లా కొత్త సీఎంగా కిరణ్ పేరు ఖరారైంది. ఆయన గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఒక ముఖ్యమంత్రి పోయి, మరో ముఖ్యమంత్రి రావడానికి... సరిగ్గా 24 గంటలు!

ఇంతవేగంగా ముఖ్యమంత్రి మార్పు జరగడం రాష్ట్ర చరిత్రలో బహుశా ఇదే ప్రథమం! 'పరిశీలకులు' అటూ ఇటూ చక్కర్లు కొట్టి... విషయాన్ని బాగా నాన్చిగానీ తేల్చని కాంగ్రె స్‌లో ఇది ఊహించని పరిణామం! మొత్తానికి... కాంగ్రెస్ అధిష్ఠానం తానంటే ఏంటో నిరూపించింది. షాకుల మీద షాకులు ఇచ్చింది. మెరుపులాంటి నిర్ణయాలను ప్రకటించింది. కాదు కాదు... దిమ్మ తిరిగే నిర్ణయాలను ఢిల్లీలోనే తీసుకుని, చివరి నిమిషందాకా గుప్పిట బిగించి, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఒక్కొక్కటిగా బయటికి తీసింది.

బుధవారం ఉదయం 11 గంటల సమయంలో... 'ముఖ్యమంత్రి రోశయ్య'కు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సందేశం వచ్చింది. రాజీనామా ప్రకటన చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశం అందింది. బుధవారం సాయంత్రం జరిగే సీఎల్పీ అత్యవసర భేటీకి కాంగ్రెస్ దిగ్గజాలు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ కూడా వస్తున్నట్లు తెలిసింది. అంతే... 'రాష్ట్రంలో ఏదో జరగబోతోంది' అని స్పష్టమైంది.

ఒక్కసారిగా హడావుడి మొదలైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు రోశయ్య మీడియా ముందుకు వచ్చారు. 'నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను' అంటూ సూటిగా మ్యాటర్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లారు. గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా పత్రం అందించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు కూడా!

రోశయ్య రాజీనామా ప్రకటన చేసిన క్షణం నుంచే... కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తింది. నరాలు తెగే ఉత్కంఠ! తట్టుకోలేనంత సస్పెన్స్! కిరణ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, జానారెడ్డి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. రాత్రి 7 గంటల సమయంలో సీఎల్పీ అత్యవసర భేటీ జరిగింది. మేడమ్ సోనియా సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీ చదివి వినిపించారు.

రోశయ్యకు ధన్యవాదాలు చెబుతూ ఒక తీర్మానం, కొత్త సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని సోనియాకు అప్పగిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రిపై ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ వార్తలకు, ఊహలకు కాంగ్రెస్ అధిష్ఠానం త్వరగానే చెక్ చెప్పింది.

'సోనియా ఆమోదం, ఆమె నిర్ణయం మేరకు కొత్త ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు' ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి పది గంటల సమయంలో ప్రకటించారు. నిజానికి ఢిల్లీలోనే కొత్త సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలోనీ సీఎం చాంబర్‌లో ప్రణబ్, ఆంటోనీ, మొయిలీ, గులాం నబీ, రోశయ్య, డి.శ్రీనివాస్ సమావేశమయ్యారు. సోనియాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సీఎల్పీ సమావేశం సజావుగా సాగిందని తెలిపారు.

'ఇంకెందుకు ఆలస్యం... కిరణ్‌ను కొత్త సీఎంగా ప్రకటించండి' అంటూ మేడమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విధంగా... సస్పెన్స్‌కు తెర పడింది. అదే క్షణంలో కొత్త ప్రశ్నలు తలెత్తాయి! రోశయ్య రాజీనామాతోనే మంత్రివర్గం కూడా రద్దయినట్లయింది. ఇప్పుడు కొత్త మంత్రివర్గం కొలువు తీరాలి. కిరణ్ పాత మంత్రులనే కొనసాగిస్తారా? భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడతారా? అనే విషయం తేలాల్సి ఉంది.

ఇక... కొత్త స్పీకర్ ఎవరు? అనే ప్రశ్న కూడా తలెత్తింది. సభాధ్యక్షుడిగా మంత్రులు గాదె వెంకటరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలలో ఒకరిని నియమించ వచ్చని తెలుస్తోంది. అలాగే... మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆ తర్వాతి ప్రశ్న! ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు? ఆయనకు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపవచ్చని చెబుతున్నారు.

మరోప్రశ్న... పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను కూడా మార్చేస్తారా? త్వరలో పీసీసీ చీఫ్‌ను కూడా మార్చాల్సి ఉంది. ఆయన స్థానంలో సీమాంధ్రకు చెందిన మంత్రి బొత్సకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే... ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి కూడా రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మొయిలీ చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి గీతారెడ్డిని ఈ పదవి వరించనున్నట్లు గట్టిగా భావిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారాలన్నీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన వీరప్ప మొయిలీకి కూడా తెలియదని, నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఆయన చెవిన వేశారని సమాచారం. అలాగే ఈ ప్రక్రియలో గులాంనబీ ఆజాద్ కీలక పాత్ర పోషించారు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను చక్కదిద్దిన గులాంనబీని మొయిలీ స్థానంలో నియమించవచ్చని తెలుస్తోంది.

మరోవైపు... సీఎం పదవి చేపట్టనున్న కిరణ్ రెడ్డి బుధవారం రాత్రే స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. కొసమెరుపు: కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ... ఈ పదవిని గట్టిగా ఆశిస్తున్న వైఎస్ జగన్ పేరు మాత్రం ఏ దశలోనూ వినిపించలేదు.

No comments:

Post a Comment