Saturday, November 27, 2010

హస్తవాసి తేలేది హస్తినలోనే * రాష్ట్ర కేబినెట్ ఆశావహులతో ఢిల్లీ కిటకిట

రాష్ర్ట కేబినెట్‌లో చోటుకోసం శతవిధాలా యత్నాలు
కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం
ఆశల పల్లకిలో తాజా మాజీలు, పాత మాజీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


ఢిల్లీలో వాలిన దాదాపు 50 మంది నేతలు.. వారి అనుచరగణం
అహ్మద్ పటేల్, మొయిలీ, ప్రణబ్ తదితరుల ఆఫీసుల్లో సందడి
కొందరు రహస్యంగా... కొందరు బహిరంగంగా యత్నాలు
ఆశల పల్లకి
మంత్రి పదవులకోసం నేతల పోటాపోటీ  
నేడు ఢిల్లీకి సీఎం కిరణ్ హైకమండ్‌తో చర్చలు 
కేబినెట్ కూర్పే అజెండా * జాబితాతో రాత్రికి రాక
అంతా ఓకే అయితే రేపే ప్రమాణ స్వీకారాలు

లేదంటే బుధవారమే
మంచిరోజే కారణం
ఆశావహుల్లో హైటెన్షన్
ఢిల్లీలో
నేతల కోలాహలం
జగన్‌తో 21మంది భేటీ

 టెన్షన్ హైటెన్షన్‌గా మారుతోంది. అధికార పార్టీ నేతలకు బీపీలు పెరుగుతున్నాయి. నరాలు తెగుతున్నాయి. 'రాజు' ఎవరో తేలిపోయింది! ఇక మంత్రుల ముచ్చటే మిగిలింది. ఎవరికి వారు 'మేమూ మంత్రి పదవులకు అర్హులమే' అంటున్నారు! 'డిగ్రీ పాస్ అయిన వాళ్లు ఐఏఎస్ కావాలనుకున్నట్లే... ఎమ్మెల్యేలైన వారంతా మంత్రులు కావాలనుకుంటారు! ఇందులో తప్పేముంది?' అని ప్రశ్నిస్తున్నారు. కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాలని గట్టిగా నినదిస్తున్న వారు కూడా... కిరణ్ కేబినెట్‌లో మంత్రులయ్యేందుకు పోటీ పడుతున్నారు. వారూ వీరని ఎందుకు! ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే నుంచి... ఆరేడుసార్లు ఎమ్మెల్యేలుగా, ఇప్పటికే మంత్రులుగా పని చేసిన వారి వరకు! అందరూ కుర్చీపై కన్నేశారు. ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలూ కేబినెట్‌లో బెర్తుల కోసం కాచుకుని కూర్చున్నారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయి... ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. తాజాగా మాజీలైన వారు ఈ పోటీలో ముందున్నారు. పోటీదారులు సుమారు రెండొందల మంది! కానీ... గరిష్ఠంగా ఇవ్వగలిగే మంత్రి పదవులు మాత్రం నలభై నాలుగే!

తొలి విడతలో ఎంత మందిని కేబినెట్‌లో చేర్చుకుంటారు? ఎవరిని చేర్చుకుంటారు? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూరులో సమాధానాలు లభించే అవకాశముంది. శనివారం ఉదయం 6.40 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. అంతా ఓకే అయితే... జాబితాపై శనివారం అధిష్ఠానం ఆమోదముద్ర పడితే, ఆదివారమే విస్తరణ జరగవచ్చు. ఆ రోజు సప్తమి, మంచి రోజు! సోమ, మంగళవారాలు అష్టమి, నవమి! అవీ పోతే... బుధవారం! అప్పటిదాకా ఆగడం సాధ్యమేయ్యేనా! అన్ని రోజులు ఈ హైటెన్షన్, ఒత్తిళ్లు, లాబీయింగ్‌లు తట్టుకోవడం కష్టం. అందువల్ల ఆదివారమే 'మంత్రాంగం' పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఆదివారం ప్రమాణస్వీకారాలు జరిగిన సందర్భాలున్నాయి. సోనియాకు కృతజ్ఞతలు చెప్పడం, మంత్రివర్గం ఏర్పాటుపై అధిష్ఠానం ఆమోదం పొందడానికే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు. నాయకత్వ మార్పు సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో పాటు... కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కిరణ్ సమావేశం కానున్నారు. మేడమ్ సోనియాగాంధీతో మధ్యాహ్నంలోగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే.. శనివారమే సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. వస్తూ వస్తూ 'మంత్రుల జాబితా' తీసుకురావడం దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్ప మొయిలీ అందుబాటులో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే... ఆయన పరోక్షంలోనే మంత్రివర్గం కసరత్తు జరగనుంది.

వరుస భేటీలు: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజున కిరణ్‌కుమార్‌రెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం రెండు దఫాలుగా సీఎంను కలిశారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. మంత్రివర్గం కూర్పు విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ స్పష్టం చేశారని సమాచారం. శుక్రవారం ఉదయం సందర్శకులను కలసిన అనంతరం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పాలనా వ్యవహారాలపై చర్చించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్ భవన్ నుంచి రోశయ్య నివాసానికి వెళ్తున్న సమయంలోనే... ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. గురువారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వైఎస్ జగన్ నివాసం కూడా సందడి సందడిగా మారింది. శుక్రవారం ఆయనను సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. వీరిలో పలువురు విలేకరులతో మాట్లాడారు. 'మేమూ మంత్రి పదవులు ఆశిస్తున్నాం' అని నిర్మొహమాటంగా చెప్పారు. అదే సమయంలో... జగన్‌ను విస్మరిస్తే పార్టీ నాశనమవుతుందని శాపనార్థాలు పెట్టారు. జగన్‌ను కలిసిన వారిలో 90 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కిరణ్ వద్దకు వెళ్లారు. మంత్రి పదవులు ఆశిస్తూ విన్నపాలు చేసుకున్నారు. మరోవైపు... శుక్రవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

తాజా మాజీల కలవరం: మంత్రి పదవులకోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చూసి తాజా మాజీలు కలవర పడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరగడంతో మొన్నటిదాకా మంత్రులుగా ఉన్న తాము కూడా ఇతరులతో పోటీ పడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకు, అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు వీలుగా ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లేందుకు నేతలు క్యూ కట్టడం చూసిన ఒక మాజీ మంత్రి ఆశ్చర్య పోయారు. "ఇంత మంది ఢిల్లీకి వెళ్తున్నారా? వీళ్లందరికీ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం లభిస్తుందా?'' అని ఆశ్చర్యపోయారు. అన్నట్టు ఈసారి పైరవీల్లో కొంత ప్రత్యేకత కనిపిస్తోంది. నేతలు తమకు పదవి ఇవ్వాలని కోరుకోవడంతోపాటు... తమకు ప్రధానంగా పోటీగా ఉండే జిల్లాలోని నేతలకు వ్యతిరేకంగా నివేదికలు సమర్పిస్తున్నారు. ఒకటి పైరవీ అయితే... ఇంకోటి 'వి'పైరవీ అన్నమాట!

పీసీసీ, డిప్యూటీ సీఎం మాటేమిటి?: మంత్రివర్గం కూర్పుతోపాటు పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని కూడా శనివారం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీకి బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే... పీసీసీ పీఠంతోపాటు మంత్రి పదవి కూడా ఉంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో ఎంఎ ఆజీజ్ కూడా ఇలా జోడు పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా... దామోదర రాజ నరసింహ పేరు గట్టిగా వినిపిస్తోంది. సహజగా... హోంశాఖను ఉప ముఖ్యమంత్రులే నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.

కొత్త కేబినెట్‌లో చాన్స్ కోసం ఆశావహ కాంగ్రెస్ నేతలు దేశ రాజధానికి తరలివచ్చారు. నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాకముందే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధినాయకత్వంతో చర్చించడానికి ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీ వస్తారని ప్రచారం జరగడంతో దాదాపు 50మంది హస్తినలో వాలారు. ఇందులో దాదాపు 25 మంది గురువారం రాత్రికే చేరుకోగా మిగతావారు శుక్రవారం దిగారు. తరలివచ్చిన ఆశావహుల్లో ప్రముఖులు, సీనియర్లు, జూనియర్లు, తాజా మాజీ మంత్రులు, పాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. వీరి కోసం తమకున్న పాత సంబంధాలను ఉపయోగించడానికి బయల్దేరివచ్చిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వీరందరి రాకతో ఆంధ్రాభవన్‌కు ఖద్దరు కళొచ్చింది... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే మొత్తంగా ఢిల్లీ తరలివచ్చిందా అనిపించే వాతావరణం నెలకొంది. మీడియా ప్రతినిధుల పలకరింపులు, ఎవరికొచ్చే అవకాశముందంటూ ఆరాలు, టీవీ చానళ్లతో ముక్తసరి మాటలు... ఇలా భవన్ ఆవరణలో ఎక్కడలేని సందడి నెలకొంది.

‘పెద్దల’ ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు: మంత్రి పదవులకోసం ఢిల్లీ చేరిన నేతలంతా వాహనాల్లో రయ్‌మంటూ ఢిల్లీ వీధుల్లో తమకు తెలిసిన పెద్దలను కలిసే ప్రయత్నాల్లో బిజీగా తిరుగుతూ కనిపించారు. కాంగ్రెస్ అధినేత రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ పెద్దలు మోతీలాల్ వోరా, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, ఆస్కార్ ఫెర్నాండెజ్, గులాం నబీ ఆజాద్ తదితరులను కలుసుకునేందుకు ఎవరికివారు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మాజీ మంత్రి పార్థసారథి, తాను సీనియర్లమని చెప్పారు. గతంలో తనకు అవకాశం రాలేదని, ఈసారి వస్తుందేమోనని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న పార్థసారథి దీనిపై ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. కొందరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు తాజా మాజీ మంత్రులు పార్లమెంట్‌కు వెళ్లి కనిపించిన పెద్దలకు ఓ నమస్కారం పెట్టుకుని వచ్చారు. మరికొందరు మొయిలీని కలిసి తమ కోరికను విన్నవించుకున్నారు. ఇంకొందరు పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే రాష్ట్ర ఎంపీలను, ఇతర రాష్ట్రాల కీలక ఎంపీలను మంచిచేసుకునే పనిలో పడ్డారు.


గురువారం రాత్రికే ఢిల్లీ వచ్చిన కొందరు తాజా మాజీమంత్రులు, పాతమాజీ మంత్రులు పార్టీ పెద్దల్లో ముగ్గురి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారని సమాచారం. పార్టీ పెద్దల దర్శనభాగ్యం కల్పించమని కాంగ్రెస్ నేతలు చేసిన ఫోన్లతో ఆయా పెద్దల పీఎస్‌లు, పీఏల చెవులు హోరెత్తిపోయాయి. వీళ్ల పదవుల గోల తమ చెవుడుకొచ్చేట్టుందని ఓ ఇద్దరు నేతల పీఎస్‌లను వ్యాఖ్యానించారంటే ఏస్థాయిలో వారిపై ఒత్తిడి ఉందో తెలుసుకోవచ్చు.

అంతా రహస్యం...: ఢిల్లీ చేరుకున్న మాజీలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తామెక్కడున్నామో తెలీకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తాజా మాజీమంత్రులైతే ఆంధ్రాభవన్‌లో గదులు సిద్ధం చేసినా సరే భవన్‌కు దూరంగా హోటళ్లు, మిత్రుల ఇళ్లు, రహస్య ప్రదేశాల్లో బసచేయడం విశేషం. అయితే ఈ రహస్యమంతా శనివారం ఉదయం బట్టబయలు కాక తప్పదని, సీఎం వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ భవన్ ఆవరణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌ని తలపించడం తథ్యమని పరిస్థితి చెప్తోంది. మంత్రి పదవి కోసం ఢిల్లీ చేరుకున్న నేతల్లో కడప ఎంపీ వైఎస్ జగన్ చిన్నాన్న ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఓదార్పు యాత్ర విషయమై అధిష్టానానికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విభేదాలున్న సంగతి తెలిసిందే. ఓదార్పు యాత్రకు మద్దతు ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటున్న విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి ఢిల్లీకి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఢిల్లీ వచ్చిన ఆశావహులు వీరే..

తాజా మాజీ మంత్రులు: బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనరసింహ, ఆనం రామనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కె.పార్థసారథి, జూపల్లి కృష్ణారావు, పి.బాలరాజు

ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు: మల్లు భట్టి విక్రమార్క, సాకే శైలజానాథ్, కొండ్రు మురళి

సీనియర్లు, ఎమ్మెల్యేలు: జె.సి.దివాకర్‌రెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, తోట నర్సింహం, టి.జి.వెంకటేష్, రాంభూపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శేషారెడ్డి, మస్తాన్‌వలి, నాని, వి.వి.సత్యనారాయణ, అనిల్‌కుమార్, వెంకట్రామయ్య, డి.వై.దాసు, రంగారెడ్డి, తూర్పు జయప్రకాష్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, భిక్షపతిగౌడ్, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, సక్రూనాయక్, శ్రీశైలం గౌడ్, రాజయ్య, ఎం.విజయప్రసాద్

ఎమ్మెల్సీలు: వై.ఎస్.వివేకానందరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గోపీనాథ్, ప్రేమ్‌సాగర్‌రావు, రుద్రరాజు పద్మరాజు, సుగ్రీవులు, కె.జనార్దన్, కాసాని జ్ఞానేశ్వర్.

మహా మంత్రాంగం
కొత్త సీఎంకు అధిష్టానం షరతులు
మచ్చలేని వారికే కేబినెట్‌లో చోటు
విధేయతే ప్రధాన అర్హత
జగన్ వర్గీయులకు నో చాన్స్
నేడు ఢిల్లీకి కొత్త సీఎం కిరణ్
సోనియా, మన్మోహన్‌లతో భేటీ
దేశ రాజధానిలో నేతల హల్‌చల్
పదవులకోసం ముమ్మర లాబీయింగ్

'షరతులు వర్తించును'... ఇది అధిష్ఠానం మాట! మంత్రి పదవుల కోసం జాబితా తయారు చేసేటప్పుడు నాలుగు ఒకటి... అవినీతిపరులకు చోటు కల్పించొద్దు. రెండు... కడప ఎంపీ జగన్ వర్గీయులకు చెక్ చెప్పాలి. మూడు... యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగు... విధేయతకు పట్టం కట్టాలి! జాబితా తయారీ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వైఎస్ మంత్రివర్గంలో అవినీతిపరులుగా ముద్ర పడిన వారి జాబితా ఇప్పటికే అధిష్ఠానం వద్ద ఉందని... ఒకవేళ వారి పేర్లను జాబితాలో జొప్పించినా కట్ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'కరుడు గట్టిన జగన్ వర్గీయులు'గా ముద్ర పడిన వారిని పూర్తిగా దూరంగా పెట్టాలని అధిష్ఠానం కిరణ్‌కు స్పష్టం చేసింది. ఇప్పటికే తమకు విధేయత ప్రకటించిన వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా ఉంది.

దీనివల్ల వైఎస్ అభిమానులు కూడా హర్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. శనివారం ఉదయం ఢిల్లీ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఒక ప్రాథమిక జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ పలువురు సీనియర్ నేతలను కలుసుకుంటారు. మంత్రివర్గంలో తొలిదశలో 15 నుంచి 20 మందికి స్థానం లభించవచ్చునని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి దామోదర్ రాజనరసింహ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ... మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

వారు ఇప్పటికే ఢిల్లీలో వేర్వేరు హోటళ్లలో మకాం వేశారు. అలాగే... పీసీసీ అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణకు పోటీగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావును రంగంలోకి దించేందుకు పలువురు సీమాంధ్ర ఎంపిీలు ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు పిీసీసీ కన్నా కేంద్ర మంత్రి పదవే ముఖ్యమని కావూరి చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిపదవులతోపాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఖరారవుతుందని, వీటిలో ఏదో ఒకటి తనకు దక్కడం ఖాయమని బొత్స ధీమాగా ఉన్నారు. ఆయన శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో కేంద్ర మంత్రులు జై రాం రమేశ్, పళ్లంరాజు, పనబాక లక్ష్మితో పాటు పలువురు సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలతో విస్త­ృత మంతనాలు జరిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తే అందర్నీ కలుపుకొనిపోతానని, తనకు ఏ గ్రూపులు లేవని బొత్స వారికి నచ్చజెబుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నారు.

తనంతట తాను ఢిల్లీ వచ్చానని, అ«ధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పజెప్పినా నెరవేరుస్తానని ఆయన విలేకరులతో అన్నారు. మరోవైపు తెలంగాణకే పీసీసీ అధ్యక్ష పదవి దక్కాలని, ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని తెలంగాణ ఎంపీలు భావిస్తున్నారు. దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చలు జరుపుతున్నారు.

కిటకిట...: అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుని, మంత్రి పదవులు సాధించేందుకు పెద్దసంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయారు. ఎవరికి వారు, ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో... దేశ రాజధాని రాష్ట్ర రాజకీయాలతో వేడుక్కుతోంది. ఒక్కసారిగా వచ్చి పడుతున్న నేతలకు బస కల్పించలేక ఏపీ భవన్ అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ఏపీ భవన్‌లోని గదులన్నీ ఇప్పటికే నిండిపోయాయి.

ప్రస్తుతం 'మాజీ'లు కావడంతో... తాజా మాజీ మంత్రులకు కూడా ఏపీ భవన్‌లో గది దొరకడం దుర్లభంగా మారింది. పీసీసీ రేసులో ముందున్న బొత్స సత్యనారాయణకే ఇక్కడ గది లభించలేదు. దీంతో... ఆయన ఎంపీగా తన సతీమణి బొత్స ఝాన్సీకి ఇచ్చిన క్వార్టర్‌కు వెళ్లారు. శనివారం మరింత పెద్ద సంఖ్యలో నేతలు ఢిల్లీకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సదరన్ హోటల్, జనపథ్‌తో పాటు పలు ఇతర హోటళ్లను కూడా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment