Sunday, November 28, 2010

సొంత ముద్రతో ఢిల్లీలో పనులు చక్కబెడుతున్న సీఎం * సలహాదారులు సహా జగన్ వర్గం ఔట్

సొంత ముద్రతో ఢిల్లీలో పనులు చక్కబెడుతున్న సీఎం
సలహాదారులు సహా జగన్ వర్గం ఔట్
దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి
బుధవారం నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం


నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వినూత్నంగా ముందుకు పోతున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు అధిష్టానం మాట వింటూనే మరోవైపు తన ముద్ర వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. అంతా గోప్యంగానే ఆయన ఢిల్లీలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. తనతోపాటు ఎల్లవేళల ల్యాప్‌టాప్ ఉంచుకుని ఢిల్లీ పెద్దలకు పంపవలసిన లేఖలు కూడా ఆయనే స్వయంగా రాసుకుంటున్నారు.

ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థకు భరతవాక్యం పలుకుతూ సలహాదారుల రాజీనామాను తీసుకోవలసిందిగా చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లు ఆయనే నేడు స్వయంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణవారికే ఇస్తున్నట్టుకూడా ఆయన వెల్లడించారు. నూతన మంత్రివర్గం బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

కొత్త మంత్రి వర్గంలో జగన్ వర్గానికి చోటు లేదని ఢిల్లీ నుంచి తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తేలిపోయింది. జగన్ ఓదార్పు యాత్రలో చురుగ్గా పాల్గొన్న వారెవరికీ పదవులు లేనట్టే. అయితే మరీ సీనియర్లు అయిన వారిని కూడా ప్రస్తుతానికి దూరం పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. జిల్లాకు ఒకరు చొప్పున ప్రస్తుతం మంత్రుల జాబితా తయారు అయినట్టు తెలుస్తున్నది. అయితే బయటకు వచ్చిన సమాచారమంతా ఆనోటా, ఈనోటా విన్నదేగాని, అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రం సోనియాగాంధీని కలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో సంక్షిప్తంగా మాట్లాడారు. మంత్రి వర్గంలో ఎవరెవరుంటారని అడిగిన ప్రశ్నలకు బుధవారమే తెలుస్తుందని ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గం ఉంటుందని ఆయన అన్నారు.

నూతన మంత్రి వర్గంలో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డికి ప్రాతినిథ్యం ఉంటుదని తెలుస్తున్నది. అలాగే రోశయ్య నిష్క్రమణతో వైశ్యులకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వారికి సంతృప్తి కలిగిస్తూ టీ.జీ. వెంకటేష్‌కి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పదవి దామోదర రాజనర్సింహకు ఇస్తారని ఢిల్లీలో బాగా ప్రచారంలో ఉంది.

పీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యన్నారాయణపేరు వినిపిస్తున్నా ఆయన మంత్రి పదవి కూడా ఉంటేనే పీసీసీ అధ్యక్ష పదవికి సై అంటున్నట్లు సమాచారం అందుతున్నది. అయితే ఈ పరిణామాలపై ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉన్నది.

No comments:

Post a Comment