Thursday, November 25, 2010

కొత్త సీఎంగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి


ఆయన పేరును ఖాయం చేసిన మేడమ్... నేటి మధ్యాహ్నం 12.14కు ప్రమాణ స్వీకారం

ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ నేత: మొయిలీ... రోజంతా ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ పరిణామాలు

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హేమాహేమీల సమక్షంలో సీఎల్పీ సమావేశం

సీఎం ప్రమాణ స్వీకారానికి మొయిలీ, ఆజాద్... సీఎల్పీ భేటీకి విజయమ్మ, జగన్ దూరం

రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (50) ఎంపికయ్యారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతున్న ఆయన రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు చెందిన నాయకుడు. సీఎల్పీ నేతగా ఎంపికైన కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. గురువారం ఆయనొక్కరే ప్రమాణం చేస్తారని, మంత్రివర్గ ఏర్పాటుకు ఒకట్రెండు రోజులు పడుతుందని సమాచారం. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ నాయకత్వం తెర మీదకు తెచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఆందోళన ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవిని ఏర్పాటు చేస్తుండటం విశేషం!

తెలంగాణకు చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనున్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. అధిష్టానం దూతగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి 10.10కి కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించారు. అంతకుముందు సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ నేత ఎంపిక అధికారాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని భేటీ ఆమోదించింది. బుధవారం సీఎల్పీ అత్యవసర సమావేశం ఉంటుందని మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రకటన రావడం తెలిసిందే.

సరిగ్గా 24 గంటల్లో, బుధవారం రాత్రి అదే సమయానికి కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఆ నడుమ అనేకానేక ఆకస్మిక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి రోశయ్య మధ్యాహ్నం 1.30కు రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో పీఠం ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రణబ్‌ముఖర్జీ, వీరప్పమొయిలీ, ఎ.కె.ఆంటోనీ, గులాంనబీ ఆజాద్ వంటి హేమాహేమీల సమక్షంలో సీఎల్పీ సమావేశం జరగడం విశేషం! నిర్ణీత సమయానికన్నా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన భేటీలో కొత్త సారథి ఎంపిక బాధ్యతను ఏకగ్రీవంగా సోనియాకు కట్టబెట్టడం, తర్వాత కిరణ్ పేరును ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

రోశయ్య రాజీనామా ప్రకటించగానే కాంగ్రెస్ శిబిరంలో హడావుడి ఎక్కువైంది. అసలు సీఎల్పీ ఎజెండా ఏమిటో తెలియక అంతవరకు చాలామంది నేతలు తికమకపడ్డారు. అంతులేని ఊహాగానాలతో ఉదయమంతా ఉత్కంఠ రాజ్యమేలింది. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన రోశయ్య, బుధవారం మధ్యాహ్నం రాజీనామా ప్రకటన చేసిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. తక్షణం ఆయన ఆమోదముద్ర వేశారు.

తెలంగాణకు డిప్యూటీ సీఎం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తదితరాల నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చడంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. రాయలసీమకు చెందిన కిరణ్‌ను సీఎం పదవి వరించగా, తెలంగాణ నేతను డిప్యూటీ సీఎం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. మొయిలీ ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన చేశారు. డిప్యూటీ సీఎం ఎవరన్నది త్వరలోనే తేలుస్తామన్నారు. సీఎల్పీ భేటీ అనంతరం రాత్రి 8.45కు ప్రణబ్ విలేకరులతో మాట్లాడారు.

సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. ‘‘నేను, ఆంటోనీ, ఆజాద్, మొయిలీ ఈ సీఎల్పీ సమావేశానికి వచ్చాం. 156 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు మినహా అత్యధికులు హాజరయ్యారు. సీఎల్పీ కొత్త నేతను ఎంపిక చేయాల్సిందిగా సోనియాను అభ్యర్థిస్తూ వారు, ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రోశయ్య సేవలను అభినందిస్తూ రెండో తీర్మానాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశం కేవలం సీఎల్పీ నేత ఎంపిక కోసమే. మరే ఇతర అంశమూ దీనిలో లేదు. చర్చించే సందర్భమూ లేదు’’ అని ప్రణబ్ చెప్పారు.

దూతలతో కిరణ్ భేటీ: అధిష్టానం దూతలుగా వచ్చిన ప్రణబ్, మొయిలీ, ఆంటోనీ, ఆజాద్ సీఎల్పీ భేటీ తర్వాత కాసేపు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సమాలోచనలు జరిపారు. అనంతరం లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం కొత్త నేత ఎంపిక వ్యవహారం, సీఎల్పీ తీర్మానం తదితరాలను వారు సోనియాకు వివరించినట్టు సమాచారం. ఆ తర్వాత కిరణ్ పేరును సోనియా ఖరారు చేశారు. అనంతరం ఆ నిర్ణయాన్ని అతిథి గృహం బయట ప్రణబ్ విలేకరులకు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే కిరణ్ అక్కడికి చేరినా, ప్రణబ్, ఆంటోని అప్పటికే ఢిల్లీ వెళ్లడానికి కార్లో విమానాశ్రయానికి బయల్దేరారు. మొయిలీ, ఆజాద్ గురువారం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నాక ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎల్పీ నేతగా ఎంపికైన కిరణ్‌ను వారు అభినందించారు.

సీఎంగా ఎంపికవగానే స్పీకర్ పదవికి కిరణ్ రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపారు.
కొద్దిరోజులుగా ఊహాగానాలు: సీఎం మార్పు ఖాయమని కొద్దిరోజుల క్రితం ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి కిరణ్ పేరు అందరి నోళ్లలోనూ నానుతూనే ఉంది. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ దీనిపై చర్చ సాగుతూనే ఉంది. బుధవారం రోశయ్య రాజీనామా ప్రకటన తర్వాత సీఎల్పీ భేటీ దాకా తర్వాతి సీఎం ఎవరన్న దానిపై పలు ఊహాగానాలు వినిపించాయి. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అసలు సీఎంను మార్చాలన్న అధిష్టానం నిర్ణయం మొదలు అన్ని నిర్ణయాలనూ చివరి నిమిషం దాకా అత్యంత గోప్యంగా ఉంచిన తీరు పార్టీ వర్గాలను సైత ం విస్మయపరిచింది. సీఎల్పీ అత్యవసర సమావేశముందని మంగళవారం రాత్రి సమాచారం వచ్చినప్పటి నుంచి బుధవారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయ్యేవరకు ప్రతి నిమిషానికీ ఉత్కంఠ, పలు ఊహాగానాలు, ఆశావహుల ప్రయత్నాలు, ఆ తర్వాత కొత్త మంత్రివర్గం కూర్పుపై అంచనాలు... ఇలా గడిచింది!

తప్పించేందుకే రోశయ్యకు సమన్లు
సోమవారం పుట్టపర్తిలో సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రోశయ్య అర్ధంతరంగా పర్యటనను కుదించుకుని మంగళవారం ఉదయం ఢిల్లీ పయనమయ్యారు. పదవి నుంచి తప్పుకోవడం గురించి ఆయనకు అప్పటికే సమాచారం ఉన్నట్టు చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీ చేరిన ఆయన అహ్మద్ పటేల్‌తో కలిసి రహస్యంగా సోనియాను కలిసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అదేమీ లేదని ఢిల్లీలో మీడియాకు చెప్పినా, బుధవారం రాజీనామా ప్రకటన సందర్భంగా అసలు విషయాన్ని ఆయనే బయట పెట్టారు. మంగళవారమే సోనియాకు రాజీనామా ఇచ్చినట్టు వెల్లడించారు. కానీ సీఎల్పీ సమావేశం విషయాన్ని మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా కూడా తెలియనివ్వలేదు. ఢిల్లీ నుంచి మంగళవారం రాత్రి అమీర్‌పేటలోని తన నివాసానికి చేరేదాకా గోప్యత పాటించిన రోశయ్య, ఆ తర్వాత ‘మొయిలీ వర్తమానం పంపారు. సీఎల్పీ అత్యవసర సమావేశముంది’ అంటూ ఎమ్మెల్యేలకు సమాచారమిచ్చారు.

No comments:

Post a Comment