వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాస్త్రాన్ని తిప్పి కొట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం ఫలితం కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. సోమవారం కిరణ్ పార్టీ సమావేశం పెట్టారు. పార్టీలో అందరం కలిసే పని చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టిన శత్రువులను సహించకూడదని ఆయన చెప్పారు. సమావేశంలో సాక్షి పత్రికలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారు తీర్మానం చేశారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటామని అందరూ చెప్పారు. సమావేశ అనంతరం పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ జగన్ రాజీనామాను తప్పుబట్టారు.
మాజీమంత్రులు బాలరాజు, కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్, జానారెడ్డి తదితరులు జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామాలను దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిణామాలు కాంగ్రెసు పార్టీకి కొత్త కాదని వారు అన్నారు. జగన్ పార్టీ వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సోనియా ఆశయ సాధనకు పార్టీని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జగన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం తొందరబాటని, దురదృష్టకరమన్నారు. రాజీనామాకు గల కారణాలు జగన్ పేర్కొన్నవి అసంబద్దమైనవన్నారు.
సోనియా గాంధీ ఫ్లెక్సీ, బొమ్మలు తగులపెట్టడం, శవయాత్రలు చేయటం చాలా దుర్మార్గమన్నారు. త్యాగశీలి అయిన సోనియాను లక్ష్యంగా చేసుకొని జగన్ వర్గం మాటలు జారడం సరికాదన్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు సోనియాగాంధీకి ఎప్పుడూ అవమానం జరగలేదన్నారు. తన కుమారుడు ఇలా చేయడం పట్ల రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాజకీయంలో 30 ఏళ్ల అనుభవం ఉండి శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెసు కార్యకర్తగా ఉన్న వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఇస్తే తప్పవుతుంది. కాని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి ఇవ్వడం తప్పు కాదా అని వారు ప్రశ్నించారు. సీనియారిటీ కన్నా సిన్సియారిటీ లేని వారికి ప్రాధాన్యం ఇవ్వలా అని వారు అన్నారు.
No comments:
Post a Comment