Saturday, November 27, 2010

లాబీయింగ్‌ వద్దు..


cm-speach
లాబీయింగ్‌లతో ప్రభుత్వంలో కీలక శాఖలో పోస్టింగ్‌ను దక్కించుకోవాలని చూసేవారికి ఇకపై కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెక్‌ పెట్టబోతున్నారు. ఉన్నతాధికారుల పోస్టింగ్‌లో ఇకపై పనితీరే ప్రామాణికంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 48 గంటలు గడవక ముందే నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తనదైన శైలిలో అధికారులకు ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ చ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఓ కీలకవ్యక్తి ద్వారా ఉన్నతాధికారులు ప్రభుత్వంలో కీలక శాఖల్లో పదవులు దక్కించుకోవడం సంప్రదాయంగా కొనసాగింది.

ఇకపై ఇటువంటి సంప్రదాయానికి కిరణ్‌ చెక్‌ పెట్టే అవకాశం ఉందని పలువురు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఉన్నతాధికారులకు ఇకపై ముకుతాడు పడుతుందా అనేది వేచి చూడాల్సిందేనని పలువురు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిధిగృహంలో అఖిలభారత క్యాడర్‌ అధికారులతో ిసీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఇకపై పరిపాలన కొనసాగుతుందని అధికారులకు పరోక్షంగా వ్యవహరించారు. ఇదిలాఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొంతమంది అధికారులు హవా కొనసాగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా గతంలో కీలకశాఖల్లో పనిచేసిన కొందరు అధికారులు పూర్తి అవినీతిలో కూరుకుపోయారని వీరిపై చర్యలు తీసుకునేందుకు కిరణ్‌ సాహసం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. కాగా శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించిన పలు అధికారులతో ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తారని శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వ చేపడుతున్న ప్రతి సంక్షేమ పధకం నిరుపేదలకు అందించే విధంగా అధికారులు కృషిచేయాలని, ఇందులో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని కిరణ్‌ పేర్కొన్నట్లు సమాచారం.

Lakeview.
ముఖ్యంగా మంచి క్రికెటర్‌గా పేరొందిన కిరణ్‌కుమార్‌ రెడ్డి తన టీంను ఆచి తూచి ఎంచుకుంటారని పార్టీ లోని కొందరు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం మచ,్చలేని అధికారులను ఎంచుకుని, తనదైన శైలిలో పాలన కొనసాగిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కొణిజేటి రోశయ్య వద్ద పనిచేసిన అధికారులను తిరిగి కొనసాగించేందుకు కిరణ్‌ సుముఖంగా లేరని సమాచారం. ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి జి.సుధీర్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ , ఎస్‌.పి.సింగ్‌, సంజయ్‌జాజు, జయేశ్‌రంజన్‌, చంద్రవదన్‌, జగదీశ్వర్‌ గుప్తా, ఎల్‌.వీ.సుబ్రహ్మణ్యం, డీజీపీ కరణం అరవిందరావు, ఐజీ ఇంటెలిజెన్స్‌ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

No comments:

Post a Comment